Irrigation Sector Allocations in TG Budget 2024 : రాష్ట్రప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయిలో బడ్జెట్‌లో సాగునీటి రంగంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణం కంటే, తుది దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి మొగ్గుచూపింది. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిందని, ఎన్డీఎస్‌ఏ సూచనల ఆధారంగా ప్రాజెక్టును కాపాడుకుంటామని ప్రకటించింది.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024
నీటి పారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో 22వేల 301 కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 ప్రాజెక్టులు చేపడితే 42 ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 31 ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రాజెక్టులను ఈ ఏడాది, 12 ప్రాజెక్టులను వచ్చే ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణుల సూచనలకు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుపై విచారణ కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు.రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చి, సౌరశక్తి రంగానికి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ రంగానికి ప్రభుత్వం 16వేల 410 కోట్ల రూపాయలు కేటాయించింది. నాణ్యమైన కరెంట్‌ను నిరంతరాయంగా అందించాలన్నది ప్రధాన లక్ష్యమని పేర్కొంది.