Government Summer Camps In Telangana :నల్గొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్విమ్మింగ్ క్యాంపు చిన్నారులతో సందడిగా మారింది. ఈత నేర్చుకునేందుకు ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తున్నారు. 9 ఏళ్ల పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలో మూడు ఈత కొలనులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడకి ప్రతిరోజు సుమారు 200 మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. స్విమ్మింగ్ చేయడం చాలా సరదాగా ఉందని మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
సూర్యతాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ఈత కొలనులో ఈత నేర్చుకొవాలంటే, ఒక్కరికి నెలకు సుమారు ఐదు వేలు వరకు ఉంటుంది. కానీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈత కొలనుల్లో నామమాత్రపు ఫీజుతో అధికారులు సభ్యత్వం ఇస్తున్నారు. ఒక్కరికి నెలకు రూ.500 ఫీజు వసూలు చేసి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు త్వరగా ఈత వచ్చేలా కోచ్‌లు పలు మెలుకువలు నేర్పిస్తున్నారు. ఈత నేర్చుకోవడం వల్ల ఉల్లసంగా ఉండటంతో పాటు శారీరంగా ఉపయోగపడుతుందని అక్కడి కోచ్ చెబుతున్నారు.
"ప్రభుత్వం ఇక్కడ మూడు స్విమ్మింగ్ పూల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. గత పదేళ్లుగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. వేసవి కాలం రాగానే చాలా మంది పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోడానికి వస్తారు. వారి మెడికల్ ఫిట్నెస్ను బట్టి పిల్లలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ల దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకుంటాం." - సురేష్ , కోచ్ లైఫ్ గార్డ్