Telangana Police Instructions To Stop Cyber crimes :సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న కొద్దీ సైబర్ మోసాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి. అమాయకుల్ని టార్గెట్ చేసుకొని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అకౌంట్లలోని డబ్బును ఊహకందని రీతిలో లూటీ చేసేస్తున్నారు. సైబర్ మాయాజాలంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరినీ బురిడీ కొట్టిస్తున్నటు వంటి అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీపై ప్రజల్లో అవగాహన పెంచి మోసాల బారిన పడకుండా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. సైబర్ పరిశుభ్రత కోసం సూచిస్తోన్న కొన్ని జాగ్రత్తలివిగో!
ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు :
- గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, వెబ్‌సైట్‌లలో పాప్‌అప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
- మీకు పరిచయం లేని వారికి సీవీవీతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలు, క్రెడిట్/డెబిట్ కార్డుల సమాచారాన్ని పంపొద్దు.
- పోర్న్‌సైట్‌లు చూస్తున్నట్లుగా తప్పుడు ఆరోపణలతో వచ్చే ఈ-మెయిల్స్/మెసేజ్‌లను అస్సలు నమ్మవద్దు.
- మీ ఫ్రెండ్స్, బంధువులు లేదా పైఅధికారుల వాట్సప్ డీపీలతో ఉన్నటువంటి సోషల్ మీడియా ఖాతాల నుంచి డబ్బులు అడిగినట్లు వచ్చే సందేశాలను నమ్మకండి.
- ఒకవేళ అంత అవసరమైతే వాళ్లే మీకు కాల్ చేసి అడుగుతారు కదా. మీకు అలాంటి మెసేజ్ వచ్చినట్లయితే మీ ఫ్రెండ్‌ను నేరుగా సంప్రదించే ప్రయత్నం చేయండి.
- మీకు తెలియని చోట నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ను, అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయొద్దు లేదా క్లిక్ చేయొద్దు.
- మీ కంప్యూటర్లు/సెల్‌ఫోన్స్‌లో అసురక్షితమైన/అన్‌వెరిఫైడ్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేయొద్దు.
- ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటి రిమోట్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేయకపోవడమే ఉత్తమం.
- ఓపెన్/పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను వాడకపోవడమే మంచిది.
- పబ్లిక్ ప్రదేశాల్లో యూఎస్‌బీ పోర్టులతో ఫోన్ ఛార్జింగ్ పెట్టొద్దు.
- పార్ట్‌టైం జాబ్‌లు/వర్క్‌ఫ్రమ్ హోమ్‌ల పేరిట వచ్చేటువంటి కాల్స్ లేదా సందేశాలను నమ్మొద్దు. కనీసం వాటికి రెస్పాండ్ అవ్వొద్దు
- స్టాక్‌లు/ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టే ముందు నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంల పట్ల జాగ్రత్త వహించడం అవసరం.