TELANGANA CM REVANTH REDDY PROTEST: మణిపుర్ అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘చలో రాజ్‌భవన్’ చేపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
రహదారిపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాజ్‌భవన్ సమీపంలో రహదారిపై బైఠాయించి సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నిరసన తెలిపారు.
బీఆర్‌ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి: అదానీపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ తన వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదానీ అవినీతి, అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేయడానికి బీజేపీ చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఏఐసీసీ ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
రాజ్‌భవన్‌కు దగ్గరలోనే పోలీసులు నిలుపుదల చేయడంతో అక్కడే బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని అదానీకి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అదానీ అవినీతి, అక్రమాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అభియోగాలు మోపినప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.