Telangana Budget for Home Department :తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో హోం శాఖకు చెందిన పలు విభాగాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాలకు గతంలో కంటే భారీగా నిధులు పెంచారు. ఇటీవల సైబర్ నేరాలు, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించిన పోలీసులకు మద్దతుగా ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులను భారీగా పెంచింది.
హైదరాబాద్‌పై నిధుల వర్షం! : సైబర్ సెక్యురిటీ బ్యూరోకు గతేడాది రూ.3.33 కోట్లు ప్రతిపాదించగా ఈ ఏడాది అయిదింతలు పెంచి రూ.15 కోట్లు కేటాయించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు గతేడాది రూ.8.50 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించారు. డీజీపీ, ఐజీ శాఖాధిపతులకు రూ.374.48 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ. 100 కోట్లు తగ్గించారు. కీలకమైన హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ విభాగానికి అత్యధికంగా రూ. 276.44 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నగరంలో మరో కీలకమై కమిషనరేట్ అయిన సైబరాబాద్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. రాచకొండ కమిషనరేట్‌కు రూ.9.40 కోట్లు కేటాయించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రూ.20 కోట్లు, జైళ్ల శాఖకు రూ.16.78 కోట్లు కేటాయించారు.
గ్రేహౌండ్స్ నిధుల్లో కోత : విపత్తు నిర్వహణ, ఫైర్ సర్వీసులకు రూ.26.39 కోట్లు, సైనిక సంక్షేమానికి రూ. 3.33 కోట్లు, పోలీసు నియామక మండలికి రూ.3 కోట్లు, భరోసా కేంద్రాలకు రూ.50 లక్షలు, మహిళా భద్రత విభాగానికి రూ.76 లక్షలు, ఇంటెలిజెన్స్‌కు రూ.108 కోట్లు, డీజీ పరిరక్షణ దళానికి రూ.3.50 కోట్లు, గ్రేహౌండ్స్ విభాగానికి గతేడాది 3.19 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.1.94 కోట్లు మాత్రమే కేటాయించారు.