AP 10th Class Student Warning to Teacher : పదో తరగతి ఉత్తీర్ణత అనేది విద్యార్థి దశలో కీలక ఘట్టం. ఉన్నత చదువులు చదవాలన్నా, కనీసం ఇంత వరకు చదివానని చెప్పుకోవాలన్నా పదో తరగతి ప్రామాణికంగా చెబుతారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా, కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయిస్తారు. ఒకప్పుడు పదో తరగతి ఉత్తీర్ణుడు అంటే గొప్పగా చెప్పుకునేవారు. కాలం మారుతున్న కొద్దీ విద్య అందరికీ అందుబాటులోకి రావడం, విద్యా విధానంలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో గత కొంత కాలంగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత అనేది అరటి పండు ఒలిచినంత తేలిక అనే అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది.
ఒక వేల పరీక్షలు తప్పినా, మరో రెండు నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు ఉండనే ఉన్నాయి. దీంతో విద్యార్థులకు పదో తరగతి పాస్ అవకపోతే ఏంటీ పరిస్థితి అనే ఆలోచనే ఉండటం లేదు. కానీ ఈ పరీక్ష ఉత్తీర్ణత కోసం ఓ విద్యార్థి చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది. పదో తరగతి విద్యార్థి జవాబుపత్రంలో సమాధానం చూసి, పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రంలోని ఉపాధ్యాయులు ఒకింత ఆశ్చర్యపోయారు. తనకు మార్కులు వేయాలంటూ ఆ విద్యార్థి సమాధాన పత్రంలో రాసింది చదివిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కంగుతిన్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.