TDP Leaders Met CS Jawahar Reddy: పేదలకు ఇళ్ల వద్దే ఫించన్ ఇప్పించే వరకూ తెలుగుదేశం నేతలు విశ్రమించకుండా ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇదే అంశం పై తెలుగుదేశం ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి తెలుగుదేశం సీనియర్ నేతలు పెద్ద ఎత్తున సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. పెన్షన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేదలకు ఇళ్లవద్ద పింఛను అందకుండా కుట్ర పన్నిన వైసీపీ ప్రభుత్వం, ఆ నెపం ప్రతిపక్షాలపై నెడుతున్న తీరును తప్పుబడుతూ సీఎస్, ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన తెలుగుదేశం నేతలు వెంటనే వ్యవస్థను చక్కదిద్దాలని వినతిపత్రాలు అందచేశారు.
వాలంటీర్లను పథకాల పంపిణీకి వినియోగించడానికి వీల్లేదని ఎన్నికల కమీషన్ చెప్తే.., తెలుగుదేశం కుట్ర చేసిందని చెప్పడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. మార్చి 29, 30, 31 తారీఖుల్లోనే కొన్ని వేల కోట్లు తమవారు అనుకునే కాంట్రాక్టర్ లకు కట్టబెట్టేశారని ఆరోపించారు. వాలంటీర్లను పక్కనపెడితే రాష్ట్రప్రభుత్వం వద్ద సచివాలయ ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. సెర్ప్ సీఇవో మురళీధర్ రెడ్డి సచివాలయ కార్యాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని నిలదీశారు. ఎలక్షన్ కమీషన్ ఎక్కడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పింఛన్ల వ్యవహారంలో సీఎం జగన్ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పించను సొమ్మును సచివాలయాల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం... వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమేనన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలే గాని సచివాలయాల్లోనే ఇస్తామనడం జగన్ అరాచకాలకు నిదర్శనమని రామానాయుడు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో సచివాలయాల సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయవచ్చని సూచించారు. ప్రభుత్వ అధికారులు మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవరకు టీడీపీ, జనసేన, భాజపా కూటమి అండగా తోడుగా ఉంటుందని నిమ్మల వెల్లడించారు. జగన్ సీఎం కుర్చీ కోసం, అధికారం కోసం దిగజారుడుతనానికి పాల్పడుతున్నాడని విమర్శించారు.
జగన్ పింఛనర్ల పొట్టకొట్టారు - దిగిపోతూ కూడా పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు: చంద్రబాబు - Chandrababu on Pensions Delay in AP
పింఛన్ల పంపిణీపై వైసీపీ రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశపూర్వకంగా వ్యహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మండిపడ్డారు. గ్రామంలో, వార్డుల్లో 40 మందికి ఇంటి దగ్గర కెళ్ళి ఇవ్వడానికి 10 రోజులు కావాలని సీఎస్ చెప్పడం రాజకీయ ప్రేరేపితమైన వ్యాఖ్యలని విమర్శించారు. దీనిపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఫించన్లు అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సంఘం కూడా ఈమేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది.
పెన్షన్ పంపిణీకి మార్గదర్శకాలు- కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష - CS VIDEO CONFERENCE