TDP Leaders House Arrest :పోలింగ్ రోజున మాచర్లలో వైఎస్సార్సీపీ నాయకులు జరిపిన దాడిలోగాయపడిన తెలుగుదేశం శ్రేణులను పరామర్శించేందుకు, వైఎస్సార్సీపీ అరాచకాలకు నిరసనగా నేడు 'చలో మాచర్ల' కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. గుంటూరు జల్లా మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మాచర్లకు బయలుదేరారు. అయితే అందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ ప్రకటించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్న ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డితో పాటు తెలుగుదేశం బృందంలో ఉన్న ఇతర నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.
TDP Calls For Chalo Macherla :మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహా నిర్బంధం చేశారు. మాచర్లలో పిన్నెలి బాధితుల్ని పరామర్శించేందుకు నేడు ఛలో మాచర్లకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. ఉదయం గుంటూరు వెళ్లి, నక్కా ఆనంద్ బాబు నివాసం నుంచి టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు తదితర నేతలతో కూడిన బృందం మాచర్ల వెళ్లాలని నిర్ణయించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పిన్నెల్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పాలని బృందం నిర్ణయించింది. మాచర్ల వెళ్లకుండా తెలుగుదేశం నేతల్ని పోలీసులు గృహా నిర్భంధం చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు కాపలా ఉన్నారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే జూలకంటిని గృహనిర్బంధం చేశారు.
సిగ్గు చేటు :తెలుగుదేశం పిలుపునిచ్చిన చలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా ఖండించారు. మాచర్ల హింసను జగన్ ఆధ్వర్యంలో నడిచే మీడియా వెనకేసుకురావటం సిగ్గు చేటని మండిపడ్డారు.