Nara Bhuvaneswari Fake Audio on Dalits :వైఎస్సార్సీపీకి చెందిన సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీల నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు ఈసీకి ఫిర్యాదు చేశారు. నారా భువనేశ్వరి దళితులను తిడుతున్నట్లుగా నకిలీ వార్తలు సృష్టించి, దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎన్ని సార్లు మందలిస్తున్నా అధికార పార్టీ నేతల తీరులో మార్పు రావటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Leaders Complaint To EC:నారా భువనేశ్వరి మాట్లాడని అంశాలను మాట్లాడినట్టుగా పెట్టి ఆడియో క్లిప్పింగ్‌లను సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతలు ప్రచారం చేయిస్తున్నారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. తద్వారా టీడీపీపై వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తప్పుడు పనులు చేసి అధికారం నిలబెట్టుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు చెబుతామని సవాలు విసిరారు. ఈ వ్యవహారంపై సీఐడీ అడిషనల్ డీజీకి ఆదేశాలు ఇచ్చి ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయిస్తామని ఎన్నికల అధికారులు హామీ ఇచ్చారని అన్నారు.