Yanamala Rama Krishnadu Challenge to YS Jagan:ఆర్ధిక సర్వేపై స్పందించే ధైర్యం వైఎస్ జగన్కు ఉందా? అని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ఐదేళ్ల జగన్ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని యనమల ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తోందని అన్నారు.
వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయిందని యనమల మండిపడ్డారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడ వల్ల రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోయిందని అన్నారు. ఉత్పత్తుల లేక అప్పుల బాధతో ఎంతో మంది రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్స్య, ఆక్వా రంగాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ నిర్వహణాలోపంతో ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా తయారుచేశారని విమర్శించారు.