మమ్మల్ని తరిమేయడం కాదు - మీ సంగతి చూసుకోండి: సోమిరెడ్డి (ETV Bharat) TDP Leader on YSRCP Leaders Attacks: అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ఓటేయడానికి వేచి చూశారని, మొదటి విడతలో ఎన్నికలు రాలేదని బాధపడ్డారని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాబోతోందని స్పష్టంచేశారు. కడపలో మెజార్టీ సీట్లు కూటమికి, నెల్లూరులో 10కి 10 స్థానాలు రాబోతున్నాయని తెలిపారు. మంగళగిరిలో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy Chandramohan Reddy) మాట్లాడారు.
జగన్ తన సొంత చెల్లెల్ని రాజకీయంగా జగన్ చంపేశాడని, తల్లిని గతంలో విశాఖలో పోటీ చేయించి ఓడగొట్టాడని సోమిరెడ్డి అన్నారు. తల్లి, చెల్లికి ఓ రాజ్యసభ సీటు ఇవ్వలేకపోయాడని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు హద్దు మీరొద్దని హెచ్చరించారు. ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపడానికి తామేం గాంధీ మహాత్ములం కాదని అన్నారు. చంద్రబాబు ఇంటి మీదకు వచ్చిన జోగి రమేష్‌కి అసలు విషయం త్వరలో అర్థమవుతుందన్నారు.
'జగన్‌కు జైలు గుర్తొస్తుంది- ఓటమి భయంతో రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారు' - TDP leaders Fire on YSRCP Attacks
రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలనేది చాలా ముఖ్యమన్న సోమిరెడ్డి, సమర్థ నాయకుడి చేతిలో అధికారం ఉంటే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 135 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, తల్లి, ఇద్దరు చెల్లెళ్లు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.
20 రోజుల తర్వాత మమ్మల్ని తరిమేస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారని, మమ్మల్ని తరిమేయడం కాదని, మీ సంగతి చూసుకోండి అంటూ సోమిరెడ్డి హితవు పలికారు. బయటనుంచి గూండాలు, రౌడీలను సర్వేపల్లికి తీసుకొచ్చారన్న సోమిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగాయని పేర్కొన్నారు. మే13వ తేదీ అయిపోయిందని, జూన్ 4వ తేదీ మిగిలి ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
"అసలు ఈ దాడులు ఏంటి. ఈ దౌర్జన్యాలు ఏంటి. ఎన్నికల అనంతరం దాడుల గురించి చివరికి ఎన్నికల సంఘం డీజీపీని, సీఎస్‌ని పిలిచి మరీ మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటివి ఏ రాష్ట్రంలో అయినా చూశామా. అయిదు సంవత్సరాలు ప్రజలను గొంతెత్తకుండా చేశారు. ఇప్పుడు ప్రజలు భారీగా వచ్చి ఓట్లు వేశారు. దానిని ఓర్చుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు. 20 రోజుల తరువాత తెలుగుదేశం వాళ్లు స్థానికంగా ఉండలేరు అంట. అసలు ఏంటిది. కచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. 135 సీట్లలో విజయం సాధిస్తాం. కడపలో వైసీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది". - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత
ఓడిపోతున్నామని తెలిసే వైఎస్సార్సీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: వర్ల రామయ్య - TDP Leaders Complain to Governor