Atchannaidu on Visakha incident:విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం, డీజీపీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి అచ్చెన్న తీసుకెళ్లారు.
మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుందని, ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖపట్నంలోని కంచరపాలెంలో వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే తమపై దాడి జరిగిందని బాధితులు చెప్తున్నారని గుర్తు చేశారు. బాధితులు చెప్పిన విషయాన్నే మీడియా కూడా ప్రచురించిందని, ఈ ఘటనపై విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు.