కూటమి మేనిఫెస్టోతో జోరుగా ప్రచారం - వైఎస్సార్సీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు TDP JanaSena BJP Leaders Election Campaigning in AP : ఎన్నికల ప్రచారానికి కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో కూటమి అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో దూసుకెళ్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తూ తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్తూ అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు.
సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కూటమి నేతలు - ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు
శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి మహిళలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు రణస్థలం మండలంలో ఇంటింటి ప్రచారం చేశారు. రోడ్‌షో నిర్వహించి కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు.
ఇంటింటికి తిరుగుతూ మేమున్నామంటూ భరోసా : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ భవన నిర్మాణ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన కొంత మంది భవన నిర్మాణ కార్మికులు జనసేనలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసాపురం మండలంలోని దర్శరేవు, రాజులంకలో ఇంటింటికి తిరిగారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాసవర్మను గెలింపించాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి మేనిఫెస్టోతో వైసీపీ ఓటమి ఖాయం : విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి - సంక్షేమం కలబోతగా ప్రకటించిన కూటమి మేనిఫెస్టోతో వైసీపీ ఓటమి ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా వెనిగండ్ల రామును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వైసీపీకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం : వైసీపీకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందని బాపట్ల జిల్లా వేమూరు కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలంలో ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ కూటమి అభ్యర్థి శ్యామ్‌బాబు వెల్దుర్తి మండలంలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్‌ను గద్దె దించాలని ఓటర్లను కోరారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలం చిందుకూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అలాగే గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండలంలో ప్రచారం చేశారు. రెండేళ్లలో కాల్వ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలతో BTP జలాశయాన్ని నింపుతానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి అనేక గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో కూటమి అభ్యర్థి సవిత ప్రచారం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టో కరపత్రాలు ఓటర్లకు పంచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మడకశిరలోని ఒకటో వార్డులో కూటమి అభ్యర్థి ఎం.ఎస్. రాజు ప్రచారం చేశారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
కూటమితోనే బీసీలకు రక్షణ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో సుమారు వందమంది నాయకులు సుజనా చౌదరిని కలిశారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమితోనే బీసీలకు రక్షణ, న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
హోరెత్తిన ప్రచారాలు- అస్త్రశస్త్రాలతో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు - Political Parties Election Campaign
జోరుగా సాగుతున్న కూటమి నేతల ప్రచారం - అడుగడుగునా జననీరాజనం - Lok Sabha elections 2024