Seaplane Tourism in Godavari : ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజీ వెనుక జలాలపై నుంచి సీ-ప్లేన్ రయ్‌మని దూసుకొచ్చి శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ల్యాండ్ అయింది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించి మల్లికార్జునుడి దర్శనం చేసుకున్నారు. తద్వారా పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు, కొత్తపుంతలు తొక్కించేందుకు అదో సరికొత్త ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ పడకేసిన పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కోవలోనే కొన్నింటికి ప్రత్యేక నిధులు కూడా విడుదలయ్యాయి. దీనిపై పర్యాటక ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గోదావరి అందాలను విహంగ వీక్షణంలో చూసే అవకాశం మళ్లీ కలుగుతుందన్న ఆశ వారిలో ఉదయిస్తోంది. గగన విహారంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గతంలో సందడి చేసిన పర్యాటక విమానం తిరిగి వినియోగంలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. తద్వారా గోదావరి అందాలను విహంగ వీక్షణంలో చూడొచ్చని ఆశపడుతున్నారు.
రాష్ట్రంలో తొలి పైలట్ ప్రాజెక్టు ఇక్కడే : 2018వ సంవత్సరంలో పర్యాటక విమానాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. పైలట్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా ఒక చిన్న విమానం ఇక్కడ ఏర్పాటైంది. చెన్నైకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతాల అందాలను దగ్గరగా గగన తలం నుంచి వీక్షించేలా దీన్ని ఏర్పాటు చేసి ‘గగన విహారి’ అని పేరు పెట్టారు. ఆ తరువాత అధిక వర్షాలు రావడం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కనుమరుగైంది.
తనివితీరా వీక్షించే వారు :గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను కనులారా వీక్షించేందుకు ఈ గగన విహారి అప్పట్లో ఎంతో అనువుగా ఉండేదన్నది పర్యాటక ప్రియుల మాట. అఖండ గోదావరి, కడియం నర్సరీ అందాలు, అంతర్వేది వద్ద సముద్రం కలిసే సాగర సంగమం, పోలవరం ప్రాజెక్టు కట్టడాలు ఇలా తనివితీరా వీక్షించే వారు. నగరంలోని ప్రాంతాలు, విద్యుత్తు ప్లాంటు, దేవాలయాల గోపురాలు చూపరులను ఆకట్టుకునేవి.