ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ సిబ్బంది వెతలు - చాలీచాలని జీతాలతో అవస్థలు - Talli Bidda Express Staff Problems

Talli Bidda Express Staff Problems: గర్భిణీ, బాలింతల ఇంట్లో వెలుగులు నింపే తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ సిబ్బంది కంట కన్నీళ్లే మిగులుతున్నాయి. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Talli_Bidda_Express_Staff_Problems
Talli_Bidda_Express_Staff_Problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 7:42 PM IST

Talli Bidda Express Staff Problems: తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. పేరుకు పైలెట్లు, వారి జీవితాలు మాత్రం దుర్భరం. నెలకు 7,870 రూపాయల వేతనంతో బతుకీడుస్తున్నారు. అదీ కూడా నెలనెలా సక్రమంగా చేతికి అందక తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ సిబ్బంది అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పని చేసినా వేతనం పెరగక, మరోవైపు ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ కింద పని చేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కో పైలెట్​ను నియమించారు. ప్రధాన యజమాని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అయినప్పుటికీ ఒప్పంద సంస్థ నియమించింది. ఇటీవల అరబిందో సంస్థ కొందరిని నియమించింది. గర్భిణీలను కాన్పులకు నిత్యం ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు. డెలివరీ అయిన తర్వాత బాలింతలను, పుట్టిన బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్తారు.

పెండింగ్ జీతాలు అడిగితే బెదిరింపులా - యోగా శిక్షకుల ఆవేదన

నెలకు 60 మందిని కనీసం గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అయితే గత కొంతకాలం నుంచి తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందిపై అదనపు పనిభారం మోపుతున్నారు. కొందరిని 104 సేవలకు పంపుతున్నారు. దీంతో సిబ్బందిపై ఆర్థికంగా భారం పడుతుంది. తాను పనిచేసే చోటు నుంచి 104 వాహనం వరకు వెళ్లేందుకు రవాణా ఛార్జీలు, కనీస అవసరాలకు ఖర్చులు అవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ ఉద్యోగి 45 రోజుల పాటు 104 సేవలు కొనసాగిస్తే సుమారు 5వేల రూపాయల పెట్రోలు, ఛార్జీల రూపంలోనే ఖర్చయిపోయాయని వాపోయారు. వాహనానికి ప్రమాదం జరిగితే వాటికి అయ్యే ఖర్చును ఉద్యోగి నుంచి రికవరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు గ్లూకోజ్ తక్కువగా ఉన్న గర్భిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి చికిత్స చేసిన అనంతరం ఇంటికి సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యతను కూడా తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి అప్పగించారు. దీంతో పనిభారం పెరిగిందని చెబుతున్నారు.

మాట తప్పిన జగన్- పుర, నగరపాలక సంస్థలపైకి ఆరోగ్యభత్యం భారం

సిబ్బందికి మొత్తం 9 వేల రూపాయల వేతనంగా గతంలో నిర్ణయించారు. అదే వేతనం ఇప్పటి వరకు కొనసాగుతుందని వారు చెబుతున్నారు. వేతనంలో 1,230 రూపాయల వరకు పీఎఫ్ కింద కట్ అయిపోగా కేవలం 7,870 రూపాయలు మాత్రమే సిబ్బంది చేతికి వస్తుంది. యాజమాన్యం చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను సైతం తమ నుంచే కట్ చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలీచాలనిజీతంతో కుటుంబాన్ని పోషించలేక అప్పుల బారిన పడుతున్నారని వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నా వేతనం పెంచట్లేదని, ఆప్కాస్​లోకి సైతం తీసుకోవట్లేదని ఆందోళన చెందుతున్నారు. తమకు కనీస వేతనం 18 వేల రూపాయలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి లాంటి పెద్దాసుపత్రుల వద్ద ఎక్కువ సంఖ్యలో తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలుంటాయి. సిబ్బంది ఆహారం కూర్చుని తినే వెసులుబాటు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని సిబ్బంది చెబుతున్నారు.

వేతనాలు లేకుండా పనులా ? - ఎమ్మెల్యే బాలినేని వాహనాన్ని అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details