Synergene Active Incident Updates : అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్-3లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మరణించారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
రూ.కోటి చెక్కును అందించిన యాజమాన్యం :అక్కడ సూర్యనారాయణ మృతదేహానికి శవపరీక్ష పూర్తి, కుటుంబానికి అప్పగించారు. ఈ క్రమంలోనే మార్చురీ వద్ద మృతుడి కుటుంబానికి యాజమాన్యం రూ.కోటి చెక్కును అందించింది. అదేవిధంగా అతని స్వస్థలం విజయనగరం జిల్లాకు మృతదేహం తరలింపునకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఇప్పటికే ఇదే ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్ పూరి, రొయా అంగిరియా మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
Minister Anitha on Parawada Accident : సినర్జిన్ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతిచెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. విశాఖలో జరిగిన రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించి భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆ రెండు ఘటనలపై హోం మంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించానని అనిత వెల్లడించారు.