Suspension on Tickets in NTR District :ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు తెలుగుదేశంలోకి వైఎస్సార్సీపీ నేతల చేరికను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేస్తుండగా, మరోవైపు జనసేన అభ్యర్థికి టికెట్ కేటాయించే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పోటా పోటీగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
టికెట్ అంశాన్ని పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారు: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఉచ్చులో జనసేన శ్రేణులు పడవద్దని సూచించారు. జనసేనకు ఉన్న కార్యకర్తల బలంతో 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్ధానాలకు పోటీ చేస్తున్న అంశాన్ని జనసైనికులు గుర్తించాలని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ కార్యకర్తల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పని చేస్తుందని తెలిపారు. అందుకోసం ప్రభుత్వ సొమ్ముతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని ఆరోపించారు.
పొత్తులో భాగంగా జనసేన మూడు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనున్నట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలు శాశ్వత ప్రతిపాదికగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే పవన్ అంటే వైఎస్సార్సీపీ నాయకులకు భయమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసమే పని చేయాలని, సీటు ఎప్పుడు వస్తుందనేది ఆలోచించకూడదని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని పోతిన మహేష్ తెలిపారు.