ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం - ఐదుగురితో సిట్‌ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం - Supreme Court On Tirumala Laddu - SUPREME COURT ON TIRUMALA LADDU

రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని వ్యాఖ్య

Supreme Court On Tirumala Laddu
Supreme Court On Tirumala Laddu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 11:10 AM IST

Supreme Court On Tirumala Laddu Issue : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై తదుపరి దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేసింది. కోట్లాది భక్తుల మనోభావాలకు భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్‌ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్న విషయాన్ని దాచిపెట్టడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వాడటాన్ని తాము ఏమాత్రం సమర్ధంచబోమని తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచిస్తూ లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణను ముగించింది.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితోగానీ, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పర్యవేక్షణలోగానీ దర్యాప్తు జరిపించాలనే విజ్ఞప్తిని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పుడున్న సిట్ స్థానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, తదుపరి దర్యాప్తు బాధ్యతలను దానికి అప్పగించింది.

లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు : ఉపముఖ్యమంత్రి పవన్‌ - Supreme Court On Laddu Issue

అది భక్తుల్లో నమ్మకాన్ని నింపుతుంది: ఈ విషయంలో తగిన సూచనలివ్వాలని గత విచారణ సందర్భంగా సుప్రీం చేసిన సూచనల మేరకు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయం కోర్టు ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్‌లోని సభ్యులకు అవసరమైన సమర్థత, అర్హతలున్నాయని, బాధ్యతల నిర్వహణలో వారికి వ్యతిరేకంగా ఏ కారణాలూ కనిపించలేదని పేర్కొన్నారు. అయినా సిట్‌పై అనుమానాలు లేవనెత్తుతున్నందున, కేంద్ర పోలీసు బలగాల్లోని సీనియర్ అధికారుల్ని పర్యవేక్షించనివ్వాలని సూచించారు. తద్వారా అఖిల భారత కోణం, ఆహార భద్రత విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లువుతుందని, అది భక్తుల్లో నమ్మకాన్ని నింపుతుందని తుషార్‌ మెహతా పేర్కొన్నారు.

ఈ దశలో స్పందించిన జస్టిస్‌ గవాయ్‌ దర్యాప్తును ఎవరు కొనసాగించినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చూశామని, మీరేమంటారని టీటీడీ తరపు న్యాయవాది సిద్దార్థలూథ్రాను ప్రశ్నించారు. పత్రికా ప్రకటనలను పరిగణలోకి తీసుకోవద్దని లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించలేదని TTD ఈవో చెబితే, అసలు మొత్తానికే ఎప్పుడూ ఉయోగించలేదని ఆయన చెప్పినట్లు పత్రికల్లో ప్రచురించారని న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, తాము ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం సూచించిన వారినీ, రాష్ట్ర ప్రభుత్వ సిట్‌లో సభ్యులుగా చేర్చడానికి తమకు అభ్యంతరం లేదన్నారు.

సుప్రీం ధర్మాసనం మరో కేసులో బిజీ - తిరుమల లడ్డూ వివాదంపై శుక్రవారం విచారణ - SUPREME COURT ON TTD LADDU ROW

ఎంతో మంది ఎన్నో ప్రకటనలు చేశారు: పిటిషనర్‌ వైవీ సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాత్రం లడ్డూ కల్తీ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటన చేసినందున, స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ గవాయ్‌ ఈ విషయంలో ఎంతో మంది ఎన్నో ప్రకటనలు చేశారని వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితేంటని ప్రశ్నించారు. సిబల్‌ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ ఆక్షేపించారు. లడ్డూ విషయంపై సీఎం ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. జులైలో వచ్చిన NDDB నివేదికను, సెప్టెంబర్‌లో ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తావించారని వివరించారు. నివేదిక రాకముందే CM మాట్లాడినట్లు చెప్పడంలో నిజం లేదని ధర్మాసనానికి వివరించారు.

కానీ పత్రికల్లో ఆయన ఏ ఆధారం లేకుండా తుది నిర్ణయానికి వచ్చినట్లు ప్రదర్శించారని ఆక్షేపించారు. దీనికి సంబంధించిన తేదీలన్నీ తన వద్ద ఉన్నాయని, ఇప్పటివరకూ జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అంశమని రోహత్గీ అభిప్రాయపడ్డారు. TTD న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా తాము అన్ని నివేదికలను సూక్ష్మంగా పరిశీలించామని స్పష్టం చేశారు. ఆ రోజు సరఫరా అయిన నెయ్యిని ఒరిజినల్‌ మ్యానుఫ్యాక్చరర్‌ ఉత్పత్తి చేయలేదని, సర్వీస్‌ టాక్స్‌ నివేదికల ద్వారా ఈ విషయాన్ని గుర్తించామని తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం: సుబ్రహ్మణ్య స్వామి, సుబ్బారెడ్డి పిటిషన్లు ఒకేలా ఉన్నాయని, ఒకదానిలోని తప్పులు మరో పిటిషన్‌లో యదాతథంగా ఉన్నట్లు చెప్పారు. టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన సుబ్బారెడ్డి ప్రస్తుతం విజిలెన్స్‌ విచారణ ఎదుర్కొంటున్నారని, దానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్‌ దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారని లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విజిలెన్స్‌ విచారణను దాచిపెట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, రాజకీయ డ్రామాలకు న్యాయస్థానాలను వేదిక చేయదలచుకోలేదని వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది.

సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూపై సీఎం స్పందించారు: దగ్గుబాటి పురందేశ్వరి - purandeswari on CBN TTD COMMENTS

లడ్డూ కల్తీ ఆరోపణలు గంభీరమైనవనే విషయంలో ఎలాంటి అనుమానం లేదని, దానికి నిర్దిష్ట ఆధారం ఉందా అని జస్టిస్ గవాయ్‌ ప్రశ్నించారు. అయితే కచ్చితమైన ఆధారాలున్నాయని, జంతు కొవ్వు ఉపయోగించారని, దాన్ని సిట్‌ కనిపెడుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది రోహత్గీ చెప్పారు. సీఎంకి వ్యతిరేకంగా గ్యాగ్‌ ఆర్డర్‌ లేదన్న రోహత్గీ, వాళ్లు కూడా రాజకీయ నేతలే కాబట్టి మాట్లాడుతున్నారని అన్నారు. జులై 16న NDDB ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే అదంతా వెజిటబుల్‌ ఫ్యాట్‌ తప్ప జంతుకొవ్వు కాదని సుబ్బారెడ్డి తరపు న్యాయవాది సిబల్‌ వాదించారు.

పిటిషనర్లు లేవనెత్తిన ప్రతీ అంశానికి సమాధానంగా అఫిడవిట్ వేస్తామని, ఏ తేదీలో ఏం జరిగిందో చూపడానికి తాము సిద్దంగా ఉన్నామని రోహత్గీ స్పష్టం చేశారు. జులై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలోని నెయ్యి కల్తీదని, జులై 4 వరకూ వచ్చిన ట్యాంకర్లను పరీక్షించలేదని TTD న్యాయవాది సిద్దార్థలూథ్రా చెప్పారు. ఈ దశలో కల్తీ ట్యాంకర్లను ఎందుకు అనుమతించారని సిబల్‌ ప్రశ్నించగా, డిసెంబర్‌లో మీరు ఇచ్చిన కాంట్రాక్టే అని లూథ్రా స్పష్టంచేశారు. కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్‌ ప్రశ్నించగా పరీక్షలు జరిపేది కొండపైనే కదా అని జస్టిస్‌ గవాయ్‌ స్పందించారు.

అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్నాక తాము సీబీఐ డైరక్టర్‌ పర్యవేక్షణలో ఒక స్వంతత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నుంచి ఒకరిని నియమించాలని ఆదేశించారు. సీబీఐ అధికారుల పేర్లను సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం, FSSAI అధికారి పేరును ఆ సంస్థ ఛైర్మన్‌ ప్రతిపాదించాలని సూచించిన ధర్మాసనం, దర్యాప్తును CBI డైరెక్టర్ పర్యవేక్షించాలని నిర్దేశించింది.

'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration

ABOUT THE AUTHOR

...view details