SUPREME COURT ON TIRUMALA LADDU GHEE ADULTERATION: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ కోరగా, అందుకు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండటం వల్ల, ఈ కేసు ఇవాళ విచారణకు రాలేదు. మరో కేసు విచారణ ఆపి మరీ లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
కాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.