Supreme Court Fire YCP Government : రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్‌లో గత ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పును(NGT) తీర్పును సవాలు చేస్తూ జేపీ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లన్నీ ఈ ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ అగస్టిన్ జార్జి మషి ధర్మాసనం ప్రశ్నించింది. షోకాజ్ నోటీసులన్నీ ఒకే తరహాలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాము ఆదేశాలిచ్చినా నోటీసుల జారీ, కేసు నమోదులో జాప్యమెందుకైందని నిలదీసింది. జులై, ఆగస్టు వరకు ఎందుకూ తాత్సారం చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం మారాకే కేసులు పెట్టి చర్యలు మొదలు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఇప్పటివరకు 9 మందిపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అక్రమ మైనింగ్‌ని దాదాపు అరికట్టినట్లు పేర్కొన్నారు. తమపై అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవన్న జేపీ వెంచర్స్ తరఫు న్యాయవాది ఈ వ్యవహారంలో తమపై ఎక్కడా కేసు నమోదు చేయలేదని ధర్మాసనానికి తెలిపింది.
మైనింగ్ జరిపినప్పుడు తప్పక సమాధానం చెప్పాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అక్రమాలపై తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని గతంలో ఆదేశించిన ధర్మాసనం దానిపై తాజా నివేదిక దాఖలు చేయాలని పేర్కొంది. నవంబర్ 14 లోపు నివేదిక దాఖలు చేయాలని ఆదేశించి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.