Srivari Brahmotsavam Hindu Temple At Saint Louis in America : అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామి వారి గోవింద నామం మార్మోగింది. నిత్యం ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ, తిరు ఆరాధన గజవాహన సేవ వంటి క్రతువులను నిర్వహించారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఇవాళ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Saint Louis in America : గత రెండు రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు, హోమాలకు ప్రతిఫలం అన్నట్లు వడగళ్ల వానతో వరుణుడు కుండపోత కురిపించారు. భక్తులు ఆ తన్మయత్వంలోనే మూడోరోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు. ఇవాళ ఉదయం కుంభారాధనం అనంతరం వుక్తహోమం నిర్వహించి హనుమంతుడిపై కోదండధారిగా వెంకటేశ్వరుడు మాఢవీధుల్లో ఊరేగేతూ భక్తులను కనువిందు చేశారు. భారతీయ నేపథ్యం కలిగిన బెంగాలీ, మలయాళీ, తమిళ, తెలుగు, మరాఠి ప్రవాస కుటుంబాలకు చెందిన స్థానిక చిన్నారులు పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. మధ్యాహ్నం ప్రముఖ నాట్యాచార్యుడు డా.కళాకృష్ణను ఆలయ కార్యవర్గం సన్మానించింది. పలువురు స్థానిక నాట్యచార్యుల శిష్యులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు.