Srisailam Dam Gates Opened 2024 :ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నభారీ వర్షాలతో శ్రీశైలం పాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు మూడు గేట్లను ఎత్తారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర పైకెత్తి, స్పిల్‌వే ద్వారా 80,794 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 4,42,441 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులుగా ఉంది. అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.58 టీఎంసీలకు చేరింది. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 61,457 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Nagarjuna Sagar Dam Water Level :మరోవైపు నాగార్జునసాగర్‌కు రెండేళ్ల అనంతరం వరద వస్తోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 139.61 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 77,695 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 28,973 క్యూసెక్కులుగా ఉంది. రానున్న రెండు మూడు రోజుల్లో శ్రీశైలం నుంచి మరిన్ని గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగే నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మరింత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో సాగర్‌లోకి వరద ప్రవాహం ప్రాజెక్టులోకి స్థిరంగా వారం రోజుల పాటూ కొనసాగే అవకాశం ఉందనే అంచనాల మధ్య, ఆగస్టు 10లోపు జలాశయం నిండుకుండ కానుంది. మరోవైపు ఎగువ నుంచి భారీ వరద వస్తున్నందున కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దని, ఈత, పశువులను నదిలోకి తీసుకెళ్లడం లాంటివి పరిసర ప్రాంతాల ప్రజలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
Srisailam Dam: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల