Wedding Season in August :ఆషాఢమాసం ముగియటంతో ఇవాళ్టి నుంచి శ్రావణమాసం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, దానికి తోడు గురు మూఢమి రావడంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది. అయితే శ్రావణం రాకతో శుభ ముహూర్తాలకు వేళయింది. ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఈ మాసంలో మంచి ముహూర్తాలు ఇవే:
- ఇవాళ్టితో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగియనుంది.
- దీంతో ఈ నెల 31 లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు.
- ఈ నెల 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. వీటితో పాటు ఈ నెలలో 28వ తేదీ పెళ్లిళ్లకు చివరి ముహూర్తమని.. 17, 18 తేదీలు వివాహాలకు అత్యంత శుభ ముహూర్తాలని చెబుతున్నారు.
- మూడున్నర నెలల నుంచి ఎంతగానో వేచి చూస్తున్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో వారికి అనుకూల తేదీలను నిర్ణయించుకుని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.
శ్రావణం తెచ్చే పండగలు:
- శ్రావణమాసం వచ్చిందంటే ఇంటింటా పండగే.
- విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాసంలో అందరూ భక్తిపారవశ్యంలో మునిగిపోతారు.
- ఈ నెల 9వ తేదీ నుంచి పండుగలు స్టార్ట్ కానున్నాయి.
- 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి పండగలు ఉన్నాయి.
- ఈ నెలలో వచ్చే సోమవారాల్లో శివుడిని.. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని.. శనివారాల్లో విష్ణుమూర్తిని.. భక్తి, పవిత్రతో పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజాది కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.
- ఈ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు వంటి శుభ కార్యక్రమాలను అందరూ నిర్వహించుకుంటారు.