SP Garud Sumit Sunil Comments: ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ, టీడీపీ మధ్య గొడవకు సంబంధించి రెండు వర్గాల వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో వైసీపీ, టీడీపీలకు సంబంధించిన రెండు వర్గాల వారు కొట్టుకున్నారని, ఆసుపత్రిలో ఉన్న పరికరాలను ధ్వంసం చేశారని అన్నారు. ఈ విషయాలను ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ చెప్పడం జరిగిందని, ఈ విషయమై రెండు వర్గాల వారిపై కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ తెలిపారు.
సమతానగర్ గొడవకు సంబంధించి టీడీపీ, వైసీపీ నుంచి 36 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇంకా కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని జిల్లా ఎస్పీ అన్నారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.
కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు - పోలీస్ స్టేషన్ వద్ద బాలినేని ఆందోళన - Balineni Protest in Ongole PS
అసలేం జరిగిందంటే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శ్రీకావ్య ఒంగోలులోని సమతానగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా హిమశ్రీ అపార్టుమెంట్‌లోకి వెళ్లగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త చప్పిడి ప్రభావతి శ్రీకావ్యతో వచ్చిన మహిళా వాలంటీర్‌ను గుర్తించారు. రాజకీయ ప్రచారంలో వాలంటీర్లు ఎందుకు పాల్గొంటున్నారని ప్రభావతి ప్రశ్నించగా, టీడీపీ మద్దతుదారుపై వైసీపీ నేతలు జెండా కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లిన టీడీపీ నాయకుడిపైనా మూకుమ్మడిగా విరుచుకుపడి హత్యాయత్నం చేశారు.
దీనిపై ఇప్పటికే బాలినేని పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడిచేసిన వైసీపీ కార్యకర్తల తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తన కోడలు కావ్య ప్రచారంలో ఉండగా దుర్భాషలాడారని, తన కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటానా అని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టర్, ఎస్పీలు తాము ఫోన్లు చేసినా ఎత్తడంలేదని, అధికారులు ఎన్నికల సంఘం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రెండు నెలలే కదా, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే, ఇవన్నీ తాము గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. ఏ ఒక్క విషయం మర్చిపోమన్నారు. ఎన్నికలు అయిన తరువాత చూపిస్తామంటూ బాలినేని అధికారులను హెచ్చరించారు.
ఒంగోలులో రెచ్చిపోయిన వైసీపీ - టీడీపీ కార్యకర్త కుటుంబంపై మూక దాడి - అడ్డుకున్న నాయకుడిపైనా! - YSRCP TDP Activists Clash in Ongole
అంతే కాకుండా ఒంగోలు సమతానగర్‌లో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్తల అరెస్టుకు నిరసనగా ఠాణా వద్ద ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన సైతం నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు గొడవ చేస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారా అని విరుచుకుపడ్డారు.
మళ్లీ మేమే వస్తాం- లెక్కలన్నీ తేలుస్తాం! బాలినేని హెచ్చరికలు - YSRCP Leaders on ongole clash issue