Political Leaders Threaten Wine Shop Holders :మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారట్లేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలంటే వారికి 30 నుంచి 40 శాతం వాటా, లేదంటే ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించకపోతే అడ్డంకులు సృష్టిస్తున్నారు.
మద్యం దుకాణాల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భవనాలను వ్యాపారులకు ఎవరూ అద్దెకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కొంతమంది ఎలాగోలా భవనాలు అద్దెకు తీసుకుంటే అవి నిబంధనలకు అనుగుణంగా లేవంటూ ఎక్సైజ్ అధికారులతో కొర్రీలు పెట్టిస్తున్నారు. రెగ్యులర్ లైసెన్సులు పొందకుండా చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు నష్టపోతున్నారు. తద్వారా సర్కార్ ఆదాయానికి గండి పడుతోంది. ఏలూరు, తిరుపతి, పల్నాడు, కాకినాడ, కర్నూలు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ పరిస్థితి ఉంది.
15 శాతం దుకాణాలకు రెగ్యులర్ లైసెన్సు లేదు :ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం గత నెల 14, 15 తేదీల్లో ఎక్సైజ్ శాఖ ప్రొవిజినల్ లైసెన్సులు జారీచేసింది. 16వ తేదీ నుంచి పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ లైసెన్సు జారీచేస్తారు. సాధారణంగా ప్రొవిజనల్ లైసెన్సులు జారీచేసిన తర్వాత పది రోజుల్లోనే రెగ్యులర్ లైసెన్సుల జారీప్రక్రియ పూర్తవుతుంది.
ఈసారి మాత్రం ఈ గడువు ఇప్పటివరకూ మూడు సార్లు పెంచారు. మరోవైపు మద్యం దుకాణాలు ప్రారంభమై దాదాపు నెల రోజలువుతున్నా 489 దుకాణాలు ఇప్పటికీ ప్రొవిజినల్ లైసెన్సుపైనే కొనసాగుతున్నాయి. రెగ్యులర్ లైసెన్సులు పొందలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అడ్డంకులు సృష్టించటమే. శ్రీసత్యసాయి జిల్లాలో 34, పల్నాడులో 21, తిరుపతిలో 53, బాపట్లలో 20, ప్రకాశంలో 20, గుంటూరులో 24, కాకినాడలో 58, కర్నూలులో 37, తూర్పుగోదావరిలో 46, చిత్తూరులో 37 దుకాణాలకు రెగ్యులర్ లైసెన్సులు లేవు.
భవనాల యజమానులకు బెదిరింపులు : ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడానికి అంగీకరించని మద్యం వ్యాపారులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. వైన్ షాప్స్ ఏర్పాటు కోసం ఎవరైనా భవనాల్ని, ప్రాంగణాల్ని అద్దెకు ఇస్తే వాటి యజమానులను ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నారు. దీంతో వారు వెనక్కి తగ్గుతున్నారు. అనంతపురం, తాడిపత్రి వంటి చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. వైఎస్సార్, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోని పలుచోట్ల ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. అనంతపురం నగరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.
- సత్తెనపల్లె నియోజకవర్గంలో 30 శాతం వాటా లేదా ఏటా రూ.30 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యనేత కుమారుడు, ఓ గుత్తేదారు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
- బాపట్ల నియోజకవర్గంలో 30 నుంచి 35 శాతం వాటా అడుగుతున్నారు. అప్పటివరకూ దుకాణాలకు రెగ్యులర్ లైసెన్సు రాదని బెదిరిస్తున్నారు.
- ఒంగోలు నియోజకవర్గంలో ముఖ్యనేత మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. తనకు 35 శాతం వాటా ఇవ్వాల్సిందేనని వ్యాపారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు అంగీకరించనివారికి దుకాణాల ఏర్పాటుకు తగిన ప్రాంగణాలు లభ్యం కానివ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
- చిలకలూరిపేట, పెదకూరపాడుతో పాటు ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
"లైసెన్సులు మాకిచ్చి పోండి - ప్రతి నెలా ముడుపులివ్వాల్సిందే"- మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు
మద్యం దుకాణాల్లో మాకు షేర్ ఇవ్వండి - లేదా వాటిని వదిలేయండి - AP Wine Shop Tenders 2024