Some Aadhar Cards Deactivate in Telangana :ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ కావడం లేదు. వయసు ధ్రువీకరణ పత్రం, భూములు రిజిస్ట్రేషన్లు ఇలా చాలా వాటికి ఆధార్ కార్డే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆధార్ కార్డులో సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో చెక్ చేస్తే అవి డీయాక్టివేట్ అయినట్లు చూపించడమే ఇందుకు కారణం. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి వాటిని యాక్టివేట్ చేయించుకునే ప్రక్రియలో గందరగోళానికి గురవుతున్నారు.
చదువుకున్న వారు అయితే డీయాక్టివేట్ అయిన దాన్ని ఎలాగోలా యాక్టివేట్ చేసుకుంటారు. కానీ చదువురాని వారు యాక్టివేట్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆధార్ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకుంటే, డీయాక్టివేట్ అయినట్లు చూపిస్తున్నాయి. అలాగే ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి.
ఆధార్ కార్డు డీయాక్టివేషన్‌కు ప్రధాన కారణాలు :
- ఆధార్ కార్డుల జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో వయసు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
- డీ యాక్టివేట్ అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నా, అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో చూపించవు.
- ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల బీడీ కార్మికుల పీఎఫ్ కోసం వయసు సవరణలకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఆధార్లు డీయాక్టివేట్ అయ్యాయి.
- ఆధార్ కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలి ముద్రల బదులు వారివి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్‌ను అప్డేట్ చేసుకున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
- కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన సాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయనకు మొదటి నుంచి అసలు ఆధార్ కార్డే లేకుండా పోయింది. ఆయన కుమారుడి కార్డు అప్డేట్ చేయబోతే అది డీయాక్టివేట్ అయిపోయింది. దీనికి సంబంధించి ప్రాంతీయ కార్యాలయంలో 40 సార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.