SIT Report to DGP on Election Violence in AP: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు.
కాగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం (EC) ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటైంది. పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైనా కేసు నమోదు చేసేలా చూడాలని అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లను సైతం జోడించాలని ఇప్పటికే డీజీపీ ఆదేశించారు.
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు- 'స్వామిభక్తి చాటుకున్న పోలీసులు' - SIT investigation
తాజాగా ఎన్నికల్లో హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ (Special Investigation Team) అందించింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదిక ఇచ్చారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. ఈకేసుల్లో 1370 మంది నిందితులుగా తేల్చిన పోలీసులు కేవలం 124 మందినే అరెస్ట్ చేశారని సిట్ నివేదికలో వెల్లడించింది.
అయితే కేవలం 124 మంది నిందితులనే ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తెలిపింది. 94 మందికి 41 ఏ నోటీసులు అందించారని తెలిపింది. మిగిలిన నిందితులను కూడా త్వరిగతిన అరెస్ట్ చేయాలని పోలీసులకు సిట్ అధికారులు సూచించారు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో 10 ,మాచర్లలో 8, గురజాలలో 4 కేసులు చొప్పున మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. మొత్తం 581 మంది నిందితులు పాల్గొంటే 274 మందిని గుర్తించారు. వీరిలో కేవలం 19 మందిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు సిట్ నివేదికలో తేల్చింది. 91 మంది నిందితులకు 41 ఏ నోటీసులిచ్చారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 చొప్పున మొత్తం నాలుగు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 61 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 14 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. 47 మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది.