Tirumala Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ఘటనలో నిందితులను తొలిరోజు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుపతి సబ్‌జైలు నుంచి భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్‌జైన్, పొమిల్జైన్లతో పాటు శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్‌లను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రుయా ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అలిపిరిలోని టీటీడీ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదున్నర వరకు సాగింది. నిందితులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారించారు.
ఉత్తరాఖండ్, తమిళనాడులోని డెయిరీలు, నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలతోపాటు టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగం అధికారులు, సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా తొలిరోజు నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా రాజీనామా చేయడంతో పాటు వాహన డ్రైవర్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించాల్సి వచ్చిందన్న అంశాలపై విపిన్‌జైన్, పొమిల్జైన్లను ప్రశ్నించారు.
SIT Inquiry Adulterated Ghee Case :డెయిరీకి పాలు ఏఏ ప్రాంతాల నుంచి సేకరిస్తారు, సేకరించిన పాల నుంచి వెన్న, నెయ్యి తయారీలో అనుసరించే విధానాలు వాటి నాణ్యతను నిర్ధారణపై ప్రశ్నించారు. 2021లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కడంలో సహకరించిన వ్యక్తులు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయి లేకున్నా టెండర్లలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందని ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది.