Siddipet Students to Create Awareness On Drugs : ఏంటీ విద్యార్థులు నేరుగా తరగతి గదిలోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? అధ్యాపకులు ఎవరూ వీరిని పట్టించుకోవడంలేదని ఆశ్చర్యపోతున్నారా? ఆడపిల్లలను ఇంతగా హేళన చేస్తూన్నా ఎవరూ పట్టించుకోవడం లేదేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? ఇదంతా ఓ లఘు చిత్రం. నేటి యువత మత్తులో ఏ విధంగా చిత్తు అవుతున్నారో కళ్లకు కట్టిచూపించే చిన్న ప్రయత్నం ఇది.
సిద్దిపేట ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు తమవంతు బాధ్యతగా డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కల్పించాలని సంకల్పించారు. కళాశాల సహకారంతో డ్రగ్స్ ప్రభావం గురించి చక్కటి సందేశాత్మక లఘుచిత్రం చిత్రీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న"డ్రగ్స్‌పై యుద్ధం" అనే లైన్‌తోనే ఈ లఘు చిత్రాన్ని చిత్రీకరించారు విద్యార్థులు.
"సమాజంలో పేరుకుపోతున్న డ్రగ్స్ మహమ్మారికి ఎంతో మంది అనారోగ్యం పాలవుతూ, జీవితాలు కోల్పోతున్నారు. విద్యా, అర్థిక, సామాజిక పరంగా ఇలా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా ప్రయత్నంగా మేము ఈ షార్ట్ ఫిల్మ్‌ను, కాలేజీ బృందం సహాయంతో రూపొందించాం. ముఖ్యంగా చిన్న వయస్సులోనే యువత ఈ మత్తుకు చిత్తవుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఎంతోకొంత ఉపయోగపడాలన్నదే మా తపన. "-కే. పవన్, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థి
డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై లఘుచిత్రం :ఆర్థిక కష్టాలు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి చాలా మంది విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని చదువుల్లో రాణించాలనుకుంటారు. కానీ విద్యాసంస్థల్లో అడుగుపెట్టాక, చెడు సావాసాలతో కెరీర్ దారి తప్పుతోంది. సిగరెట్లు, మత్తు అంటూ మెుదలై పార్టీల పేరుతో డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతున్నారు. క్రమంగా వ్యసనాలుగా మారటంతో యువత జీవితాలు ఆగం అవుతున్నాయి.
మత్తు ఎంతో మంది విద్యార్థులను చిత్తు చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకున్న డ్రగ్స్ చివరికి వ్యసనంగా మార్చుకుని, ఆ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అవగాహన కోసం పోషించిన పాత్రే ఇంత ఇబ్బందిగా ఉంటే, నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించగలుగుతున్నామని చెబుతున్నారు విద్యార్థులు.