Shirdi Sai Electricals Issue : జగన్ జమానాలో వైఎస్సార్సీపీ నాయకుల కళ్లలో సంతోషం చూసేందుకు విద్యుత్ సంస్థల నుంచి వారికి రూ.కోట్లలో లబ్ధి చేకూర్చడంలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్)లో ఒక ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి సబ్‌స్టేషన్ల పనుల కేటాయింపు, స్మార్ట్ వ్యవహారాల వరకు పార్టీ అస్మదీయులకు కట్టబెట్టడంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్‌లో అనుభవిస్తున్న కీలక హోదాతో పాటు మూడు డిస్కంలకూ ఉన్నతాధికారిగా పనిచేసే భాగ్యాన్ని కల్పించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ రుణం తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కార్ మారినా తాజాగా సుమారు రూ.70 కోట్లతో మరో 5000ల ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధనశాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారులనే మూడు డిస్కంలకు సీఎండీలుగా నియమించారన్న విమర్శలు ఉన్నాయి. గత సర్కార్ హయాంలోనే కాదు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది.
అయినవాళ్లకు రూ.కోట్లలో :వైఎస్సార్సీపీ అస్మదీయ సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చడంలో ఆ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు. ఇప్పటికీ అదే వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గత సర్కార్‌లో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ను సంతోష పెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిపీట్ ఆర్డర్ ద్వారా 6200 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకు కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో షిర్డీసాయి నుంచి 5000లు, బీఎస్‌ఆర్ సంస్థ నుంచి 700, మిగిలిన 500 ట్రాన్స్‌ఫార్మర్లను వేర్వేరు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
ప్రతి విషయంలోనూ ఆరోపణలే!
- ఏపీలో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు రూ.5692 కోట్లతో ప్రతిపాదించిన పనులను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారే కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు డిస్కంల పరిధిలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఈపీడీసీఎల్,ఎస్‌పీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను ఆ సంస్థ దక్కించుకుంది.
- ఎస్‌పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుబంధ పరికరాలకు రూ.679 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ పరికరాలు ప్రస్తుతం మదనపల్లె, పీలేరులతోపాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృథాగా పడి ఉన్నాయి.
- ఆర్‌డీఎస్‌ఎస్ కింద వ్యవసాయ కనెక్షన్ల కోసం 16, 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను రెట్టింపు ధరకు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే ప్రమాణాలున్న ట్రాన్స్‌ఫార్మర్లను తెలంగాణ డిస్కంలు రూ.64,000లకు కొనుగోలు చేస్తుంటే ఇక్కడ రూ.1.40 లక్షల చొప్పున కొని గుత్తేదారుకు భారీ లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరానికి మించి కొనేయడంతో ఇప్పటికీ సుమారు 20,000ల ట్రాన్స్‌ఫార్మర్లు గోదాముల్లో పడి ఉన్నాయి.
- ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సిఫారసుతో కాంట్రాక్టు పద్ధతిలో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- కేవలం వైఎస్సార్సీపీ నాయకులను సంతృప్తిపరిచేందుకు రాయలసీమ జిల్లాల్లో అవసరం లేని చోట సిమెంట్ స్తంభాలకు బదులుగా టవర్ల పనులను ప్రతిపాదించి సంస్థ నిధులను మళ్లించి భారీ ఎత్తున దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం.
- ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యల పేరుతో అవసరం లేని పనులను ప్రతిపాదించడం ద్వారా భారీ లబ్ధి చేకూర్చారని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పనుల్లో గుత్తేదారుకు 70 శాతం వరకు ప్రయోజనం చేకూరేలా పనులను ప్రతిపాదించినట్లు సమాచారం.
మూడు డిస్కంలకూ సీఎండీగా పనిచేసే భాగ్యం! :అస్మదీయులకు ఎంతగా జీ హుజూర్ అనకపోతే మూడు డిస్కంలకు సీఎండీగా పనిచేసే ‘సంతోషం’ ఆయనకు దక్కి ఉంటుంది? రెండు కీలకమైన డిస్కంలకు పూర్తి అధికారాలతో ఉన్నతాధికారిగా మరో డిస్కంలో ఇంఛార్జ్ హోదాలో పనిచేసిన ఘనత ఆయనకే దక్కింది. ఇంధన శాఖలో ఇదొక రికార్డని చెబుతున్నారు! ఆ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పింది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనేది బహిరంగమే.
మొదట తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో ఉన్నతాధికారిగా షిర్డీసాయి సంస్థకు అనుబంధ పరికరాల బిల్లుల చెల్లింపును చక్కబెట్టి ఆ సంస్థకు బాగా దగ్గరయ్యారు. ఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారి పదవీ విరమణతో ఆ సంస్థకు కొన్ని నెలలు ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. అక్కడ స్మార్ట్‌మీటర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు బదిలీపై పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని అదనపు బాధ్యతలతో జగన్ సర్కార్ ఈయనకే కట్టబెట్టడం గమనార్హం.
Shirdi Sai Electricals: రాష్ట్రంలో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ హవా.. ఆ సంస్థ చెప్పిందే వేదం.. చేసిందే శాసనం!
ఆదాయపన్ను అభియోగాలు - షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ సోదాలు