ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేమంతా శుభోదయం అనే పలకరించుకుంటాం - వారి వల్లే తెలుగుకు ప్రాచుర్యం : శైలజా కిరణ్‌ - SHAILAJA KIRON SPEECH

విజయవాడలో ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - ప్రసంగించిన మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌

Shailaja_Kiron_Speech
Shailaja Kiron Speech (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 12:34 PM IST

Shailaja Kiron Speech at Telugu Writers Mahasabhalu: తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు తెలుగుతల్లి విగ్రహానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ మాట్లాడుతూ ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే అభిప్రాయం తప్పు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 14వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 4వ భాష తెలుగు అని వెల్లడించారు. మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తూ కవిత్రయం వంటి కవుల కారణంగా తెలుగుకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారని, తెలుగు భాషా! సంగీతమా! అంటూ విశ్వకవి రవీంద్రుడు మెచ్చుకున్నారని గుర్తు చేశారు.

రామోజీరావుకి తెలుగు భాష అన్నా, తెలుగు రాష్ట్రాలన్నా ఎంతో ఇష్టం అని శైలజా కిరణ్‌ తెలిపారు. ఉదయం ఆయన్ను పలకరించగానే శుభోదయం అనే చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తామంతా శుభోదయం అనే పలకరించుకునేవాళ్లమని, రామోజీరావుకు గుర్తుగా ఇకపై మనమంతా శుభోదయం అనే పలకరించుకుందామని పిలుపునిచ్చారు. తమ ఇంట్లో పిల్లలు తెలుగు మాట్లాడేలా రామోజీరావుగారు శ్రద్ధ తీసుకునేవారని చెప్పారు. మనది అని అనుకుంటే దానిని మనమంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని, కాపాడుకుంటామన్నారు. అదే విధంగా తెలుగు భాష మనందరిది అని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైనదని, అందుకే మనమంతా కలసికట్టుగా తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేద్దామని శైలజా కిరణ్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్‌, విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకుడు ఎం.నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు, కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు.

మాతృభాషపై మమకారం - పరాయి గడ్డపైనా తెలుగు వెలుగులు

ABOUT THE AUTHOR

...view details