జగన్ పాలన కొనసాగితే బతికుండగా బకాయిలు అందుకోగలమా?: విశ్రాంత ఉద్యోగులు - Senior Citizens Facing Problems ap - SENIOR CITIZENS FACING PROBLEMS AP
Senior Citizens Facing Problems by Getting Their Pensions in AP : బాధ్యతల బరువును మోసి జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు ఐఆర్, డీఆర్‌లకు గండికొట్టి క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు.
జగన్ పాలన కొనసాగితే బతికుండగా బకాయిలు అందుకోగలమా?: విశ్రాంత ఉద్యోగులు
Senior Citizens Facing Problems by Getting Their Pensions in AP :బాధ్యతల బరువును మోసి జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు ఐఆర్, డీఆర్‌లకు గండికొట్టి క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు.
'జగన్ పాలనలో ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు అందుకుంటామనే ఆశ పూర్తిగా పోయింది. వైఎస్సార్సీపీ పరిపాలించిన ఐదేళ్లలో ఏవో కొన్ని నెలలు మినహా పెన్షన్ 5వ తేదీ తర్వాతే వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న వారికి ప్రతి నెలా మందులు, ఆసుపత్రుల ఖర్చు ఉంటుంది. ఈ అవసరాల కోసం పెన్షన్‌పై ఆధారపడే విశ్రాంత ఉద్యోగులం జగన్ సర్కార్ వికృత పాలనలో బలైపోయాము. సమయానికి డబ్బులు అందక చాలామంది మందుల దుకాణాల్లో అప్పులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎక్కడైనా రెగ్యులర్ ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేయడం చూస్తాం. కానీ, జగన్ జమానాలో విశ్రాంత ఉద్యోగులూ రోడ్డెక్కారు. ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ ఇవ్వాలని, డీఆర్ బకాయిలు చెల్లించాలి.' -విశ్రాంత ఉద్యోగులు
Disbursement of Pension at Door Steps : వయసు పెరిగే కొద్దీ వైద్య, ఇతరత్రా ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఇచ్చే క్వాంటం పెన్షన్‌లోనూ జగన్ సర్కారు కక్కుర్తి ప్రదర్శించి కోత విధించింది. పీఆర్సీలో కోతలు పెట్టారు. డీఆర్ బకాయిలు ఒక్కసారీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ.1.50 లక్షల చొప్పున డీఆర్, పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో అసలు ఈ బకాయిలను అందుకుంటామా? అని విశ్రాంత ఉద్యోగులు డైలమాలో పడిపోయారు. ‘అది చేస్తా ఇది చేస్తా’ అంటూ ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ దగా చేశారు.
ఐఆర్ ఇవ్వకుండా మోసం :గతేడాది సెప్టెంబరులో బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని ఈ ఏడాది జూన్‌కు వాయిదా వేసి, వారిపై పెద్ద బండ పడేసింది. 11వ పీఆర్సీ గడువు 2023 జులైతో ముగిసినందున 12వ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించాలి. కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి, ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐఆర్ ఎందుకు? ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ తప్పించుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సిన ప్రయోజనాలను నష్టపోయారు.
పదవీ విరమణ పొందిన వారికి చెల్లించాల్సిన ప్రయోజనాలు రూ.280 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఏమన్నారు?: పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం - వైకాపా మ్యానిఫెస్టో
ఏం చేశారు?: అధికారంలోకి వచ్చాక విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయలేదు. ప్రతి నెలా పెన్షన్ సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. పీఆర్సీ, డీఆర్ బకాయిలు ఇవ్వకుండా ఏడ్పించారు.
డీఆర్ బకాయిలు ఎప్పటికి : విశ్రాంత ఉద్యోగులకు డీఆర్ బకాయిలు ఇస్తే వాటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొన్నేళ్లుగా వారు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నా జగన్ మాత్రం స్పందించలేదు.
2018 జులై, 2019 జనవరి డీఆర్‌లకు సంబంధించి 66 నెలల బకాయిలను పెన్షనర్లకు ఇవ్వలేదు. రూ.1500 కోట్లను నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా..వాటి అతీగతీ లేదు. దీన్ని గత ఫిబ్రవరి చర్చల సందర్భంగా జూన్‌లోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీఇచ్చింది. ఈ ఐదేళ్లల్లో చెల్లించాల్సిన మొత్తాన్ని వచ్చే ప్రభుత్వంపైకి నెట్టేసింది.
2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఆర్ దాదాపు 54 నెలలకు సంబంధించిన బకాయిల చెల్లింపుపై స్పష్టత లేదు. 2022, 2023 డీఏ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
11వ పీఆర్సీ, రెండు డీఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటికీ తెలియని దుస్థితి. దీన్ని ఏడు వాయిదాల్లో చెల్లించేందుకు జీఓ ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ప్రభుత్వం తప్పించుకుంది. ఇవి దాదాపు రూ.7,500 కోట్ల వరకు ఉన్నాయి. చర్చల సందర్భంగా 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామని చెప్పింది. ఈ ఏడాది జనవరిలో ఇస్తామన్న 10 శాతానికి అతీగతీ లేదు.
పీఆర్సీలో ముంచేసి : 11వ పీఆర్సీ కమిటీ నివేదికను తుంగలోకి తొక్కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ సిఫార్సులను అమలుచేసింది. మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఇచ్చి, ఫిట్‌మెంట్‌ను 4 శాతం తగ్గించి 23 శాతానికి సరిపెట్టింది. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ ఇచ్చి, విశ్రాంత ఉద్యోగులను జగన్ సర్కార్ నిలువునా ముంచేసింది. దీంతో పెన్షనర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పెన్షనర్‌గాని, భాగస్వామిగాని మరణిస్తే మట్టి ఖర్చులకు రూ.15 వేలు లేదా ఒక నెల పెన్షన్ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని ఇవ్వాలనే నిబంధన ఉండగా జగన్ సర్కార్ మట్టి ఖర్చులను రూ.25 వేలుగా నిర్ణయించింది. దీంతో ఎక్కువ పెన్షన్ ఉన్నవారు నష్టపోయారు.
వయస్సు
70
75-80
80-85
85-90
90-95
95-100
100పైన
టీడీపీ హయాంలో
10%
15%
20%
25%
30%
35%
50%
జగన్ సర్కార్‌లో
7%
12%
20%
25%
30%
35%
50%
క్వాంటం పెన్షన్‌లోనూ కోతే : వృద్ధాప్యంలో ఉద్యోగులను ఆదుకోవాల్సిన జగన్ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా దగా చేసింది. పండుటాకులతో కన్నీళ్లు పెట్టించింది. వయసు రీత్యా పెద్దవారిపై కనీసం కనికరం లేకుండా వ్యవహరించింది. 70 ఏళ్ల ప్రారంభంలో ఇవ్వాల్సిన అదనపు క్వాంటం పెన్షన్‌ను 70 ఏళ్లు నిండిన తర్వాత ఇచ్చేలా సవరణలు చేసింది. 11వ పీఆర్సీలో మొదట 70, 75 ఏళ్లప్పుడు ఇచ్చే 10%, 15% అదనపు క్వాంటం పెన్షన్‌ను రద్దుచేసింది. పీఆర్సీపై ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత కొంతశాతం ఇచ్చింది. గత తెదేపా ప్రభుత్వం హయాంలో 70ఏళ్ల ప్రారంభంలో 10%, 75 ఏళ్లకు 15% క్వాంటం పెన్షన్ ఇవ్వగా జగన్ సర్కార్ రెండు విడతల్లోనూ 3 శాతం చొప్పున కోత వేసింది. 10 శాతాన్ని 7 శాతానికి, 15 శాతాన్ని 12శాతానికి తగ్గించేసింది.