Semi High Speed Rail Corridor :తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ రానుంది. ఇందులో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ను మాత్రమే ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం 27.76 కిలోమీటర్లు. ఇది సూర్యాపేట-నకిరేకల్ మధ్య ఉంటుంది.
గరిష్ఠ దూరం తుని-రాజమహేంద్రవరం మధ్య 88 కిలోమీటర్లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడం లక్ష్యం కావడంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. సెమీ హైస్పీడ్‌కారిడార్‌లో శంషాబాద్-విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో ఆరు, ఏపీలో ఆరు ఉన్నాయి. మరోవైపు కర్నూలు-విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్-విశాఖపట్నం మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ రూట్‌లో ఎనిమిది అదనపు స్టేషన్లు రానున్నాయి. ఇందులో కర్నూలు మినహా మిగిలిన అన్నీ తెలంగాణలో వస్తాయి.
ఎనిమిదిలో- ఏడు ఇక్కడే :విశాఖపట్నం-శంషాబాద్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం - కర్నూలు నగరాలను అనుసంధానం చేసే మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది అదనపు రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. వాటిలో ఏడు తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు ప్రాజెక్టుల ప్రాథమిక అంచనా వ్యయం రూ.21వేల కోట్ల పైచిలుకు ఉంటుందని సమాచారం. నవంబర్ లో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వే నివేదికతో వ్యయంపై స్పష్టతరానుంది. పెట్ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం లభించాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు అధికారులు తుది సర్వే నిర్వహించనున్నారు.