Second Day Nominations in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కోలాహలం కొనసాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పిస్తున్నారు. అభ్యర్థులు ర్యాలీలు, బల ప్రదర్శనతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. నామినేషన్లో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.
రాజ్యసభ నామినేషన్ల పరిశీలన పూర్తి - ఒకటి తిరస్కరణ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సుగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ అనంతరం సతీమణి వసుంధర దేవితో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామపత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
శ్రీకాకళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా మామిడి గోవిందరావు తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం పార్టీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో పాతపట్నంలో భారీగా రాలీ నిర్వహించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీజేపీ, జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు
విజయవాడ లోక్‌సభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కేశినేని చిన్ని నేడు నామినేషన్ వేయనున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. కేరళ డప్పుల మోతలు, సంప్రదాయ నృత్యాలతో వినాయకుడి గుడి పరిసరాలు కోలాహలంగా మారాయి. చిన్ని అభిమానులతో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేయనున్నారు.
కృష్ణాజిల్లా పెనమలూరులో తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పోరంకిలోని పార్టీ కార్యాలయం నుంచి పెనమలూరు ఎంఆర్ఓ కార్యాలయానికి ఆయన ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ ర్యాలీలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థి సీహెచ్ బాబురావు నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. పైపుల రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. బాబురావుకు మద్దతుగా ఆటో కార్మికుల సంఘం ప్రజా సంఘాలు ర్యాలీలో పాల్గొన్నారు.
అణువణువు తనిఖీలు ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు- పోలీసుల అత్యుత్సాహం - People Problems in kanigiri
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు. తాడిపత్రిలోని జేసీ అస్మిత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీగా తరలివెళ్లారు. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆర్వో కార్యాలయంలో అస్మిత్ రెడ్డి నామినేషన్ వేశారు.