Sarva Sreshta Tripathi Appointed as SIT Chief:తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘావిభాగాధిపతి మహేష్ చంద్ర లడ్హాలతో సీఎం చర్చించారు. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తిరుమల వెంకన్న లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంతో పాటు తిరుమలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను సిట్ నిగ్గు తెల్చనుంది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన త్రిపాఠి గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా పని చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజుని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఐజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిట్ చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియామకం చేశారు. ఇంకా సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.