ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్రాంతికి వస్తున్నాం' - 'ఓ సామాన్యుడి స్టోరీ' చదివేయండి! - SANKRANTHIKI VASTHUNNAM

మొదలైన సంక్రాంతి వైబ్ - ప్రకృతి పులకించే మూడు రోజుల సంబరం

sankranti_ki_vastunnam
sankranti_ki_vastunnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 2:04 PM IST

Updated : Jan 8, 2025, 3:14 PM IST

Sankranthiki Vasthunnam :"సంక్రాంతికి స్పెషల్ రైళ్లు, సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, పది రోజులకు పైగా స్కూళ్లకు సెలవులు" ఎక్కడ చూసినా ఇవే వార్తలు. అసలు సంక్రాంతికి ఊరెళ్లకపోతే ఏమవుతుంది? ఎందుకింత హంగామా! అనుకున్నాడు వంశీ. పండగలు వచ్చినపుడల్లా వ్యయ ప్రయాసలకోర్చి సొంతూరుకు వెళ్లాల్సిన అవసరమేంటి? అని ఆలోచిస్తుండగానే ల్యాప్​టాప్ పక్కనే ఉన్న మొబైల్ మోగింది. అమ్మ ఫోన్ చేసింది. 'ఏరా! ఎప్పుడు బయల్దేరుతున్నావ్' అనడమే ఆలస్యం 'ఆఫీస్​లో ఇంకా చెప్పలేదు, అయినా ఎప్పుడూ ఉండే పండగే కదా, ఈసారి రాకపోవచ్చు' అని మాట్లాడుతుండగానే మరో కాల్ ఎంగేజ్. ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ కాల్. అమ్మతో రెండు సెకండ్లు ఆన్సర్ చేసి హడావుడిగా కట్ చేశాడు. ఫుడ్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లి మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయాడు. అమ్మ మాట్లాడుతుండగానే తాను కట్ చేయడంపై మథనపడ్డాడు. ఫుడ్ తింటూనే మళ్లీ ఆలోచనలు. కట్ చేస్తే!

శంకర్ పొలిటికల్ గేమ్ ఛేంజర్ - 'ఎన్నో సీన్లకు కనెక్ట్ అవుతారు']

"అవి స్కూల్ డేస్. అమ్మ పొద్దున్నే నిద్ర లేపి రెడీ చేసి భోగి పండ్లు పోసేది. ఇక బయటికి రావడమే ఆలస్యం ఇంటి ముందు కళ్లు చెదిరే ముగ్గులు. రంగులతో హంగులు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు, పిండికొమ్మల, రేగు పండ్లు, పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. రెండడుగులు బయటకి వేసి వీధిలోకి వెళ్తే చాలు కొత్త లోకంలోకి వచ్చామా! అన్నట్లుగా వాకిళ్లన్నీ విరబూసిన పూదోటను తలపించేవి. వీధి మొత్తం పిల్లల కోలాహలం. స్నేహితుల చేతుల్లో రంగు రంగుల గాలి పటాలు.

అలా చూస్తుండగానే ఓ చేతిలో చిరతలు, మరో చేతిలో వీణ, మెడలో పూల దండ, తలపై అక్షయ పాత్ర పెట్టుకుని వినసొంపుగా పాడుతూ హరిదాసు వచ్చేవాడు. ఆయన వాకిట్లోకి వచ్చీ రాగానే అమ్మ ఇంట్లో నుంచి బియ్యం తీసుకొచ్చి పాత్రలో పోసేది. కాస్త దూరంలో గంగిరెద్దుల కోలాహలం. 'అయ్య వారికి దండం పెట్టు, అమ్మ వారికి దండం పెట్టు' అంటూ ఆడిస్తూ డూడూ బసవన్నలు ఇంటింటికీ వచ్చేవారు. డబ్బులు, ధాన్యం తీసుకుని వెళ్లిపోయేవారు. చీకటి పడుతోంది అనగానే భోగి మంటల వద్ద కోలాహలం.

ఇంట్లో పిండి వంటలు ఘుమఘుమలు నోరూరించేవి. గారెలు, వడలు, ప్రసాదాలతో కడుపు నిండిపోయేది. అమ్మకు తెలియకుండా కొన్ని గారెలు జేబులో పెట్టుకుని ఫ్రెండ్స్​తో కలిసి పొలాల వైపు వెళ్లి గాలి పటాలు ఎగరేసేది. ఫ్రెండ్స్ అంతా ఇళ్ల నుంచి తెచ్చుకున్న పిండి వంటలు తింటూ, గోదారి కాల్వల్లో ఈత కొడుతూ సరదాగా గడిపేది. ఊహల్లోనే ఆ రుచులు ఇంకా నోరూరిస్తున్నాయి." ఇప్పుడు తాను తింటున్న ఫేమస్ రెస్టారెండ్ ఫుడ్​ టేస్ట్ కూడా అమ్మ చేతి వంటతో పోలిస్తే ఏ మాత్రం పనికిరాదని గుర్తొచ్చింది. వెంటనే లేచి ఫుడ్ డస్ట్ బిన్​లో పడేశాడు.

కట్ చేస్తే! రైలు వేగంగా వెళ్తోంది. కిటికీలో నుంచి చూస్తుంటే ఆ పాత జ్ఞాపకాలన్నీ అంతే వేగంగా వెనక్కి మళ్లిపోతున్నాయి. కోనసీమ కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, గోదారమ్మ పరవళ్లు. ఒక్కసారిగా బాల్య స్మృతులు, చిన్ననాటి స్నేహితులు గుర్తుకు వచ్చేశారు. మరికాసేపట్లో దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది.

సంక్రాంతి అందరికీ అన్నీ ఇస్తుంది :

సంక్రాంతి అందరికీ అన్నీ ఇస్తుంది. పిల్లలు, పెద్దలు, యువత, రైతులకు ఆనందాలు పంచుతుంది. పశుపక్ష్యాదులకూ ఇది పండగే. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి. తొలి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ జరుపుకొంటారు. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ (నాలుగో రోజున) నిర్వహించుకుంటారు. మూడురోజుల వేడుకలే అయినా, ఏడాదిలో మిగిలిన 362రోజులు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందిస్తుంది. మూడు రోజుల్లో భాగంగా తొలి రోజున భోగి పండ్లు పోయడం, గొబ్బెమ్మలు పెట్టి వాటిపై నవధాన్యాలు చల్లడం, పిండి కొమ్మలతో అలంకరించడం, రాత్రి భోగి మంటలు. రెండో రోజు నోరూరించే రుచులు, పిండి వంటల ఘుమఘుమలు, పూజల సందడి. మూడో రోజు పశువుల పూజ ఉంటుంది.

పందెం పుంజులే కాదు గురూ! - పావురాలకూ ఫుల్ ట్రైనింగ్

రూమ్‌మేట్స్‌కి గొడవలు వచ్చేది ఎక్కువగా ఆ విషయంలోనే - ఎందుకంటే!

Last Updated : Jan 8, 2025, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details