Sand Mining in Patta Lands in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత తీర్చేందుకు పట్టా భూముల్లో తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను తవ్వి, వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం గనులశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి ఈ నెల 28న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది.
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యంత్రాలతో అక్టోబరు నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ఈలోపు అన్ని జిల్లాల్లో ఇసుక నిల్వలు తగ్గుతుండటంతో, వెంటనే నిల్వలు పెంచడంలో భాగంగా పట్టా భూముల్లో ఇసుకపై గనులశాఖ దృష్టిపెట్టింది. గతంలో ఏపీఎండీసీ (Andhra Pradesh Mineral Development Corporation Limited) ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వి విక్రయించారు. ఇప్పుడూ అలాగే పట్టా భూముల్లో ఇసుక తవ్వి, విక్రయించాలని, పట్టాదారుకు టన్నుకు 66 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు.
త్వరలోనే ఆన్‌లైన్, సచివాలయాల్లో బుకింగ్ సదుపాయం: సీఎం చంద్రబాబు - CM Teleconference with Activists
నదీ గర్భంలో ఉండే పట్టా భూముల్లోని ఇసుకను ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయం మేరకు గనులశాఖ ద్వారా తవ్విస్తారు. ఇందులో పట్టాదారుకు చెల్లించే 66 రూపాయలు, సీనరేజ్ ఛార్జీలు 88 రూపాయలు, తవ్వకాలకు అయిన నామమాత్రపు ఖర్చు తీసుకుంటారు. నదీ గర్భంలో పట్టా భూములు ఉండి, అందులో ఇసుక మేటలు ఉన్నవాళ్లు అంగీకరిస్తే, వాటిలో ఇసుకను తవ్వుతారు. వీటికి పర్యావరణ సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఈ అనుమతుల అంశాన్ని ఆయా జిల్లాల గనులశాఖ చూసుకుంటుంది.