Sammakka Saralamma Jatara 2024 : వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు వచ్చే శుభ ఘడియలు వచ్చేశాయి. జంపన్న వాగు జనసంద్రంగా మారే ఘట్టం సమీపించింది. కీకరాణ్యం జనారణ్యమై కోలాహలంగా మారేది ఇక రేపటి నుంచే. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు ప్రతిబింబంగా నిలిచే తెలంగాణ కుంభమేళా మేడారం (Medaram) మహా జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఏటా రెండేళ్లకు ఒకసారి ఈ జాతర వేడుకగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో గత బుధవారం జాతరకు అంకురార్పణ జరగ్గా వనం వీడి జనం మధ్యకు వచ్చే వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర మొదలవుతోంది.
Medaram Jatara 2024 : ఇసకేస్తే రాలనంత జనం జేజేల మధ్య సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు గోవిందరాజుల ఆగమనం మొదలు కానుంది. బుధవారం నుంచి మొదలయ్యే జాతర కోసం ముందుగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు డప్పు డోలు వాద్యాల నడుమ శివసత్తుల నృత్యాల మధ్య నేడు కోలాహలంగా మేడారానికి బయల్దేరనున్నారు. గుడి నుంచి ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు గ్రామ వీధుల్లో సందడిగా సాగుతుంది. అటవీ మార్గంలో 70 కిలోమీటర్ల మేర కాలినడకన బయలు దేరి రేపు సాయంత్రానికి మేడారానికి విచ్చేస్తారు. ఆ సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరతారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో వైభవంగా నూకాలమ్మ జాతర
జాతర రెండో రోజు గురువారం సమక్క ఆగమనమే. లక్షలాది భక్తుల కోలాహలం నడుమ సమ్మక్క గౌరవంగా గద్దెలపైకి వస్తుంది. జాతర మూడోరోజు దేవతలంతా గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. శనివారం రాత్రి దేవతలు తిరిగి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు ముందే 50 లక్షలపైన భక్తులు దేవతలను దర్శించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు లెక్కచేయకుండా తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.