ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ప్రజలు - పలుచోట్ల స్టిక్కర్లు చించివేత - SAMAGRA KUTUMBA SURVEY

అరకొరగా ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - పలు వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ప్రజలు

Samagra_Kutumba_Survey
Samagra Kutumba Survey (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 5:15 PM IST

Telangana Samagra Kutumba Survey : తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం నుంచి అరకొరగా మొదలయ్యింది. హైదరాబాద్​లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంకా స్టిక్కర్లు అంటిస్తుండగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, బంజారా హిల్స్‌లోని మంత్రుల నివాస గృహ సముదాయంలో కుటుంబ సర్వే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటికి వెళ్లి అధికారులు వివరాలు సేకరించారు. వాస్తవానికి ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించుకున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో సర్వే :జీహెచ్‌ఎంసీ (Greater Hyderabad Municipal Corporation) పరిధిలో ఇళ్లు చాలా ఉండటంతో తమకు కేటాయించిన ఇళ్లకు గణన అధికారులు స్టిక్కర్లు అంటించలేకపోతున్నారు. అవసరమైన కాగితాలు సకాలంలో అందకపోవడంతో పాటు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మధ్యాహ్నం తర్వాత రావడంతో సర్వే మందకొడిగా సాగింది. రాజకీయ నేపథ్యం, మతం, కులం వంటి సమాచారం చెప్పేందుకు కొంత మంది నిరాకరిస్తున్నారు. అదే విధంగా బ్యాంకు రుణాలు, ఆస్తులు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ వంటి వివరాలను సైతం చెప్పట్లేదు. పాతబస్తీలో కొన్ని చోట్ల స్టిక్కర్లను చింపేస్తున్నారు. మరి కొన్నిచోట్ల సర్వే అధికారులను ఇళ్లలోని రానివ్వట్లేదు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సర్వేను పర్యవేక్షించారు.

సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - ఎక్కడుంటే అక్కడే వివరాలు చెప్పొచ్చు!

పాతబస్తీ రూటే సపరేటు :పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ పూర్తిస్థాయిలో స్టిక్కర్లు అతికించలేదు. స్టిక్కర్లు లేకపోవడం, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా ప్రాంతాల్లో భారీ భవనాలు ఉండటంతో సమస్యలు తప్పడం లేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రజలు సరైన సమాధానాలు చెప్పట్లేదు. చాంద్రాయణగుట్ట పరిధిలో పలు ఇళ్లకు అతికించిన స్టిక్కర్లు చింపేస్తున్నారు.

మలక్‌పేట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, నాంపల్లిలో స్టిక్కర్లు ఎందుకు అతికిస్తున్నారని, మాకొద్దంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. షాదీముబారక్‌ డబ్బులు రాలేదు? వివరాలను ఎందుకు చెప్పాలి? అంటూ మరికొందరు ప్రశ్నించారు. తమ ఇళ్లకు రావొద్దంటూ ప్రజలు చెప్పడంతో అధికారులు సంబంధిత కార్పొరేటర్లకు ఫోన్లు చేస్తున్నారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇద్దరు కార్పొరేటర్లు గణన అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో వచ్చి దగ్గరుండి వివరాలు చెప్పిస్తామన్నారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రొ ఫార్మాల కొరత :మరోవైపు ఇంటి సర్వే కోసం అధికారులు లక్షల సంఖ్యలో ప్రొఫార్మాలు, స్టిక్కర్లు తెప్పించినా అవి సరిపోలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులకు 85% ఇళ్లకే స్టిక్కర్లు అతికించారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఖైరతాబాద్, నాంపల్లి, విజయనగర్‌ కాలనీ, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్​ఆర్​ నగర్, బాలానగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, ఆబిడ్స్‌ ప్రాంతాల్లో 40% ఇళ్లకు శనివారం రాత్రికి కూడా స్టిక్కర్లు అతికించలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పాస్‌బుక్‌ వివరాలు, ఆస్తులు, రుణాల వంటి ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు చెప్పడం లేదు.

'సమగ్ర కుటుంబ సర్వే' - వారికి ఆ సమాచారం ఇస్తే డేంజర్​లో పడ్డట్టే!

ABOUT THE AUTHOR

...view details