Sadar Festival Celebrations In Hyderabad :ప్రతీ సంవత్సరం దీపావళికి యాదవులు సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిపే ఆ వేడుకల్లో అలరించేందుకు భారీ దున్నరాజులు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి తీసుకొచ్చిన ఘోలు-2 అంతర్జాతీయ ఛాంపియన్ బుల్‌తో శ్రీకృష్ణ, షైరా, బాదో, విదాయక్ వంటి దున్నలు ఈ సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్నాయి.
హైదరాబాద్‌లో సదర్ ఎంతో ఘనంగా జరుపుకొంటారు. దున్నరాజుల ప్రదర్శనలు వీక్షకులను అబ్బురపరుస్తాయి. సైదాబాద్‌లో స్థానికంగా నివాసముండే పంజాబీ కుటుంబీకుల నేతృత్వంలో ఉత్సవాలను ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా సదర్ నిర్వహనకు సర్వం సిద్ధమంటున్నారు నిర్వాహకులు. కీర్తి శేషులు పంజా కృష్ణ యాదవ్, లక్ష్మమ్మ యాదవ్ జ్ఞాపకార్థం వారు ఏటా ఈ సదర్ ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలుపుతున్నారు. దశాబ్దాలుగా వారు పాడి పరిశ్రమను, దున్నలను నమ్ముకొని పాల వ్యాపారం చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నట్లు చెబుతున్నారు.
'మేము దున్నపోతులను ప్రత్యేకంగా చూసుకుంటాం. వివిధ రాష్ట్రాల నుంచి వాటిని ఇక్కడకు తీసుకువస్తాం కాబట్టి వాటికి కావాల్సిన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దానికోసం ప్రత్యేకంగా ఆహారం పెడతాం. రోజూ కసరత్తులు చేయిస్తాం. దీపావళి తర్వాత రెండో రోజు ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు సదర్‌ను చేస్తాం. ఈ సారి పోతులకు వచ్చిన అన్ని మెడల్స్‌ను ప్రదర్శిస్తాం. ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. మేము చేస్తున్న వ్యాపారానికి గౌరవంగా ఈ సదర్ జరుపుతాం.' - సదర్ నిర్వాహకులు