Bus congestion in AP: ఉద్యోగ, ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా ప్రజాస్వామ్య పండుగ జరుపుకోవడానికి పల్లె బాట పడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సరిపడా బస్సుల్లేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయలేదంటూ మండిపడుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో విజయవాడకు తరలివచ్చిన ప్రజలు, ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది. దీంతో టికెట్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా బస్సుల్లో సీట్ల బుకింగ్‌కు ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.
తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పందించి ఎపీ కి వెళ్లే వారి కోసం పోలింగ్ కు ముందు రోజుల్లో 300 అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో తెలంగాణ బస్సుల్లో విజయవాడ చేరుకుంటున్నారు. వారంతా విజయవాడకు చేరుకున్నా, వారు తమ సొంత జిల్లాలు, ఊర్లకు వెళ్లేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచడం లేదు. ఏపీ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు కేవలం 20 లోపే ఉన్నాయి. వీటిలోనూ ఏపీకి వచ్చే వారి సంఖ్య వేలల్లోమాత్రమే ఉంటుంది. మరోవైపు సరైన బస్సుల్లేక వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లేవని అడిగితే సిబ్బంది సరైన సమాచారం చెప్పడం లేదని, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.