Future City Road Project In Telangana:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీకి రవాణా సౌకర్యాల కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇవి హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా ఔటర్ తరహాలో 330 అడుగుల రోడ్డు నిర్మించాలని దీన్ని ప్రతిపాదించారు. దీంతో కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రిజినల్ రింగ్‌రోడ్డు వైపుగా 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించడంతోపాటు వెయ్యి ఎకరాల ప్రైవేటు భూములను సైతం అధికారులు సేకరించనున్నారు. అందుకు గాను మొదటి దశలో 458 ఎకరాలు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
లగచర్ల ఘటనను దృష్ట్యా..:వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూసేకరణపై జరిగిన రైతుల వ్యతిరేకత, దాడి ఘటనలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులు, రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా కొద్దిరోజులుగా కందుకూరు మండలంలోని గ్రామాల్లో సర్వే చేస్తున్నారు.
ఇక్కడ కొందరు రైతులను అధికారులు తమతోపాటు తీసుకెళ్తున్నారు. పోలీసులకు సమాచారమిచ్చి సర్వే పూర్తి అయ్యే వరకు ఉండాలని కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ గురించి ప్రకటించిన తర్వాత మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు రైతులు మార్కెట్ ధరలకే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మెరుగైన రవాణాకు..:కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వైపున ప్రాంతీయ రింగ్‌రోడ్డుకు నిర్మిస్తున్న రహదారి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సులభంగా చేరుకునేలా ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, రహదారులు, భవనాలశాఖ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.