Several People Died in Road Accident: అతివేగం ముగ్గురు యువకులను బలితీసుకుంది. నిండు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై దామలచెరువు పంచాయతీ పత్తిపాటివారి పల్లి అక్కగార్ల గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం భయానక వాతావరణాన్ని తలపించింది. చీకట్లో ఏం జరిగిందో కూడా స్థానికులకు తెలియలేదు. లారీ కింద మృతదేహాలు నజ్జునజ్జయ్యాయి.
ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ నుంచి నలుగురు యువకులు ద్విచక్ర వాహనంలో దామలచెరువుకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లారీ యువకులతోపాటు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిన సుమారు 150 మీటర్ల ముందుకు వెళ్లింది.
ఈ ఘోర ప్రమాదంలో జయచంద్ర (34), నారాయణ (35), నాగమల్లయ్య (14) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మనోజ్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడగా, అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడంతో పాటు, లారీ డ్రైవర్ అతివేగమే ఈ ఘటన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన జయచంద్రకు భార్యతోపాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సంతానం. అదే విధంగా నారాయణ భార్య శైలు ప్రస్తుతం గర్భిణి. ఎదిగి వచ్చిన కుమారుడు నాగమల్లయ్య మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లోయలో పడ్డ బస్సు - 26 మంది మృతి, మరో 14 మందికి తీవ్రగాయాలు!