REVENUE MEETINGS ACROSS AP: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సదస్సులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ సదస్సులు జనవరి 8 వరకు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అనగాని పిలుపునిచ్చారు.
నెల రోజుల్లోపు పరిష్కరిస్తారం: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెటేరులో సదస్సును ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేద ప్రజలకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమన్న అనగాని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పురపాలకశాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్, ఆర్డీవో అనూషతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలను అధికారులు నెల రోజుల్లోపు పరిష్కరిస్తారని నారాయణ వెల్లడించారు.
సమస్యలను పరిష్కరించుకోండి:పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో రెవెన్యూ సదస్సును మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. డీ-పట్టా సమస్యలు వివాదాలకు ప్రధానమైనవన్న మంత్రి, వాటిని పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సదస్సులను వినియోగించుకుని ప్రజలంతా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.