Revathi Husband Bhaskar About Her Son Health Condition:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. ఘటన జరిగినప్పటి కంటే ఇప్పడు శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, నాలుగైదు రోజుల నుంచి శరీరంలో కదలికలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంజక్షన్ ఇస్తే చెయ్యి నొప్పి ఉన్నట్టు స్పందిస్తున్నాడని భాస్కర్ వెల్లడించారు. రెండు రోజుల నుంచి కళ్లు తెరిచి చూస్తున్నాడు తప్ప మమ్మల్ని గుర్తు పట్టడం లేదన్నారు. అయితే మేము పక్కనే ఉండి పిలిస్తే క్రమక్రమంగా గుర్తు పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాం కానీ ఇంకా గుర్తు పట్టలేదని అన్నారు.
ఆర్ధిక సహాయం అందించినట్లు వెల్లడి: శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పలేమని వైద్యులు అంటున్నారని రేవతి భర్త భాస్కర్ అన్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు వెంటిలేటర్ సపోర్ట్‌ను తీసేశారని తెలిపారు. మైత్రీ మూవీస్ నిర్మాతలు రూ.50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షల చెక్కు, అల్లు అర్జున్ రూ.10లక్షల డీడీ లను అందించారని అన్నారు. మా వల్ల అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నారనే బాధతో కేసును వెనక్కి తీసుకుంటానని ఆయన అన్నారు. నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. బాబు ఎప్పటికి కోలుకుంటాడో తెలియదు కానీ నాకు అందరి సహకారం కావాలని భాస్కర్ విజ్ఞప్తి చేశారు.