Registration Department Help YSRCP Land Grab:పేదల నుంచి కొట్టేసిన ఎసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ పెత్తందారులు, ఉన్నతాధికారుల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఈ భూములు నిషిద్ధ జాబితా నుంచి తొలగించినట్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకున్నా రిజిస్ట్రేషన్ ఆపొద్దంటూ ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రామకృష్ణ ఆదేశాలు జారీచేసి, అక్రమాలకు చేయూతనిచ్చారు. గత జనవరిలో జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో అదే నెల 20వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లకు అవసరమైన ప్రక్రియ పూర్తికావాలని షరతు కూడా విధించారు. నిశిత పరిశీలన ద్వారా జరగాల్సిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ఇంత హడావుడిగా లక్ష్యాలు నిర్దేశించడం వెనుక ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది.
ఎసైన్డ్ భూముల విస్తీర్ణంలో తేడాలుంటే ఈ వ్యవహారాలపై నియమించిన కమిటీ సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సూచించిన రిజిస్ట్రేషన్ శాఖ కీలకమైన వెబ్‌ల్యాండ్ జోలికి మాత్రం వెళ్లలేదు. ఆలస్యమయ్యే కొద్దీ కొత్త సమస్యలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో అక్రమార్కులు రిజిస్ట్రేషన్లకు పరుగులు దీశారు. సాధారణంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అన్ని ఆధారాలు, వివరాలు సమర్పించినప్పటికీ ఏవో కొర్రీలు పెట్టి లంచాలు వసూలు చేస్తారన్న అపవాదు రిజిస్ట్రేషన్ శాఖపై ఉంది. అలాంటిది ఎసైన్డ్ భూముల విషయంలో ఆగమేఘాలపై ఆ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ రామకృష్ణ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
పేదలకు 20 ఏళ్ల క్రితం ఎసైన్ చేసిన వ్యవసాయ భూములను 2023 జులై 31 నుంచి అమ్ముకునేలా వీలు కల్పిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్ 27న గెజిట్ జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 19న జీవో 596 పేరుతో మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 13 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,62,041 ఎకరాల భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు అర్హమైనవని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఇందులో 6 లక్షల 34 వేల ఎకరాల భూముల వివరాలు జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు అందాయి.