Red Sanders Smuggling in Seshachalam Hills Region :అరుదైన జంతుజాలంతో విరాజిల్లుతున్న శేషాచలంలో ఎర్ర చందనం దొంగల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. దుంగలు వేల టన్నుల్లో అక్రమంగా రవాణా అవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో ప్రకృతి సంపదను అడ్డూ అదుపు లేకుండా నరికి సొమ్ము చేసుకున్నా కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోలేదు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి తీసుకొచ్చిన రెడ్‌శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్)ను నిర్వీర్యం చేశారు. దాన్ని అడ్డుపెట్టుకునే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కథ మొత్తం నడిపించినట్లు ఆరోపణలున్నాయి.
ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో సుమారు 4,75,599 హెక్టార్లలో శేషాచలం అడవులున్నాయి. ఇక్కడ సహజసిద్ధంగా పెరుగుతున్న ఎర్రచందనం ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు పొందింది. విదేశాల్లో ఈ దుంగలకు ఉన్న డిమాండు నేపథ్యంలో ఏటా వేల చెట్లు మోడుగా మారుతున్నాయి. పట్టుకుంటున్నది పిసరంతైతే తరలిపోతున్న దుంగలకు లెక్కలేదు.
వ్యవస్థలన్నీ నీరుగారేలా :ఎర్రచందనం రక్షణకు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అటవీశాఖ అనుసరించిన వ్యూహాలు, ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ తరువాత నీరు గార్చారు. ప్రధానమైన సీసీ కెమెరాల వ్యవస్థ కనుమరుగైంది. సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లోని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లతోపాటు జాతీయ రహదారులపై ఉన్న అటవీ తనిఖీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయమయ్యాయి. తనిఖీ కేంద్రాల్లో వాహనాల స్కానర్ల ఊసే లేకుండా పోయింది. వన్యప్రాణులను కాపాడటంతోపాటు ఏనుగులు జనావాసాలు, పంటపొలాల్లోకి రాకుండా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేయడానికి వీల్లేకుండా అడవుల చుట్టూ తవ్విన కందకాలు కనుమరుగయ్యాయి.
అదనపు సిబ్బందికి మంగళం : టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖలోని కొంతమంది అధికారులు నేతలకు కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. ఆరోపణలు బయటకు పొక్కినప్పుడు బదిలీ, వీఆర్‌కు పంపడం తర్వాత మళ్లీ అదే పోస్టుల్లోకి తేవడం కొనసాగిస్తూ వచ్చారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని వాచ్‌టవర్లు, పహారా కాసేలా ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ ఫోర్స్‌ను రద్దు చేశారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన వాచ్‌టవర్లు దిష్టిబొమ్మల్లా, అసాంఘిక శక్తులకు, స్మగ్లర్లకు ఆవాస కేంద్రాల్లా మారిపోయాయి. నిరంతరం అడవుల్లో పహారాకాసే సంచార దళాలు లేకుండా చూసుకున్నారు. బలగాలు అడవుల్లోనే ఉండేలా ఏర్పాటుచేసిన బేస్ క్యాంపులను మూసేశారు.