Reactor Blast in Pharma Company at Anakapalle in AP :ఏపీలోనిఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి, అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు.
వారి శరీర భాగాలు చిధ్రమయ్యాయి. ఓ మహిళా కార్మికురాలి పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి. కార్మికుల ఆర్తనాదాలు, ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లెయిన్‌తో శిథిలాల కిందనుంచి మృతదేహాలను వెలికితీయాల్సి వచ్చింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరుమున్నీరుగా రోదించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను తరలించారు. కార్మికులు షిప్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
"సాల్వెంట్ లీకై అది ఎలక్ట్రికల్ పానెల్ మీద పడి ఫ్లాష్ అవడం వలన ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ తాకిడికి గోడలు కూలిపోయాయి. దీని కారణంగా భారీ ప్రమాదం జరిగింది. అంతస్తులు ఏం కూలిపోలేదు". - ప్రత్యక్ష సాక్షి
ఘటనా స్థలిలో సహాయక చర్యలు :తక్షణం కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపు చేయడంతోపాటు మూడో అంతస్తులో ఉన్న 33 మంది కార్మికులను జెయింట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది.
తమవారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్దసంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి, విశాఖలోని ఉషప్రైమ్ ఆస్పత్రి, కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. సంఘటన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతోపాటు స్థానిక ఎమ్మెల్యే కొణాతాల రామకృష్ణ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ప్రమాదం ఏవిధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు. సంస్థ ప్రతినిధులెవ్వరూ స్పందించలేదని, ఉన్నతస్థాయి విచారణ అనంతరం బాధ్యతులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. రియాక్టర్ పేలలేదని, సాల్వెంట్ లీకు వల్లే పేలుడు జరిగిందని వివరించారు.
మృతుల వివరాలు: ప్రమాదం ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. వెంకుజీపాలెంకు చెందిన కంపెనీ ఏజీఎం నీలాపు రామిరెడ్డితోపాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస, అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు. నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేశ్, కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజినీర్ చెల్లపల్లి హారిక, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజినీర్ పైడి రాజశేఖర్, కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీశ్ చనిపోయారు.