RAP Company Manufactures Equipment for ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా నిలిచింది. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గుర్తింపు తెచ్చుకుంది. 6 దశాబ్దాల అంతరిక్షయానంలో ఇప్పటివరకు 99 ప్రయోగాలు చేసిన ఇస్రో ఇప్పుడు 100వ మైలురాయిని అందుకోవాలని ఎదురుచూస్తోంది. తొలిరోజుల్లో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించడం కూడా ఇస్రోకు గగనంగా ఉండేది. తర్వాత ఏటా 4 నుంచి 10 ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో అనేక ప్రయివేటు పరిశ్రమలను భాగస్వాములను చేసింది. విజయవాడ నగరానికి సమీపంలోని రెసిన్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ (ఆర్‌ఏపీ) కంపెనీలో తయారయ్యే సామగ్రి నూటికి 100 శాతం రక్షణరంగ అవసరాల కోసమే.
1984లో ప్రారంభమైన ఈ కంపెనీ నుంచి ఇంతవరకు పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఉపయోగించే కీలక సామగ్రిలో ముఖ్యమైన వాటిని ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఏ చిన్నపాటి పొరపాటుకు తావివ్వని పరిశోధనల మధ్య పూర్తిస్థాయిలో రక్షణ రంగ భద్రత గోప్యతను పాటిస్తూ వీటిని తయారు చేస్తున్నారు. ఆకాష్, ఫృద్వీ, అగ్ని, బ్రహ్మాస్, అస్త్ర వంటి ముఖ్యమైన మిసైళ్లకు ఆర్‌ఏపీ నుంచి థర్మల్‌బోట్, నాజిల్స్ వంటి అబ్లాటివ్ కాంపొనెంట్స్‌ను తయారు చేసి అందిస్తున్నారు.