Rains in AP due to Low Pressure in Bay of Bengal:రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు జిల్లాలలో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.